గ్రామాల విద్యుత్ సమస్యలకు పరిష్కారం – నూతన ట్రాన్స్‌ఫార్మర్ల ప్రారంభం
కరకగూడెం, ఫిబ్రవరి 28ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా నూతన ట్రాన్స్‌ఫార్మర్లను ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ప్రారంభించారు.
గ్రామాల్లో తరచూ ఎదురవుతున్న లో వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలను తగ్గించేందుకు ఈ ట్రాన్స్‌ఫార్మర్లు ఎంతో ఉపయోగపడతాయని ఆయన తెలిపారు. వట్టం వారి గుంపు గ్రామపంచాయతీ పరిధిలోని ఎస్సీ కాలనీలో రూ. 3 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన ట్రాన్స్‌ఫార్మర్‌ను, అలాగే చిరుమల్ల గ్రామపంచాయతీ పరిధిలోని పోల్కమ్మతోగు గ్రామంలో రూ. 3 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన మరో ట్రాన్స్‌ఫార్మర్‌ను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో స్థిరమైన విద్యుత్ సరఫరా వ్యవసాయం, గృహ వినియోగం, చిన్న వ్యాపారాల అభివృద్ధికి కీలకమని పేర్కొన్నారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎలక్ట్రికల్ ఏఈ నరహరి రాజశేఖర్, ఎమ్మార్వో కాంతయ్య, ఎంపీడీవో కుమార్, మండల అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ పాల్గొన్నారు. సర్పంచ్‌లు బట్టుపల్లి తోలెం రమాదేవి, కరకగూడెం పోలేబోయిన సుజాత, చిరుమల్ల కొమరం సుగుణ, వెంకటాపురం చౌలం కేశవరావు, పద్మాపురం తోలెం రమేష్, చొప్పాల తోలెం సావిత్రి, గొల్లగుడెం ఎల్లబోయిన ముత్తమ్మ, కొత్తగూడెం ఎర్రం పొట్టయ్య తదితరులు హాజరయ్యారు.
అదనంగా రెవెన్యూ అధికారులు, పంచాయతీ అధికారులు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులు, మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, గ్రామస్తులు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్ల ఏర్పాటు పట్ల స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.









