ఖమ్మం జిల్లా వెలుగుమట్లలో ఇళ్ల కూల్చివేతలపై కేటీఆర్ స్పందన
ఖమ్మం, ఆధాబ్ న్యూస్:
ఖమ్మం జిల్లా వెలుగుమట్ల గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల కూల్చివేతల బాధితులను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులతో మాట్లాడిన ఆయన, ప్రభుత్వ చర్యలను తీవ్రంగా విమర్శించారు.
కేటీఆర్ మాట్లాడుతూ, “ఇందిరమ్మ రాజ్యం అంటే పేదవారి ఇళ్లను కూల్చడమా?” అని ప్రశ్నించారు. ప్రభుత్వమే గతంలో ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు పత్రాలు, కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఇళ్లను ధ్వంసం చేయడం అమానుషమని అన్నారు.
బాధితుల పక్షాన తాము నిలబడతామని స్పష్టం చేసిన కేటీఆర్, ఈ అంశంపై కలెక్టర్ మరియు చీఫ్ సెక్రటరీలను కలిసి న్యాయం చేయాలని కోరుతామని తెలిపారు. అలాగే, ఈ సమస్యను శాసనసభ, శాసనమండలిలో లేవనెత్తి, అవసరమైతే సుప్రీంకోర్టు వరకు వెళ్లి న్యాయపోరాటం చేస్తామని చెప్పారు.
ఇక బాధితులకు ధైర్యం చెప్పిన ఆయన, “మీరు ఎవరూ అధైర్యపడకండి, ఏడవకండి. మీ అందరికీ మళ్లీ ఇదే స్థలంలో ఇళ్లు కట్టించి గృహప్రవేశాలు చేయించే బాధ్యత నాది” అని హామీ ఇచ్చారు.








