విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవు: జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
జిల్లా పోలీసు అధికారులతో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి కేసులో నాణ్యమైన దర్యాప్తు (Quality of Investigation) ద్వారా నేరస్థులకు శిక్ష పడేలా చేసి బాధితులకు న్యాయం చేయాలని సూచించారు.
కేసుల విచారణలో జాప్యం అసలు సహించబోమని హెచ్చరించిన ఎస్పీ, విధుల పట్ల నిర్లక్ష్యం ప్రదర్శించే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
పెట్రోలింగ్ మరియు బ్లూ కోల్ట్స్ వాహనాలతో అధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ రోడ్లపై ఉండి ప్రజలకు అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరిగే ప్రదేశాలను గుర్తించి, సంబంధిత శాఖలతో సమన్వయం చేసుకుంటూ నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. మద్యం సేవించి వాహనాలు నడపడం, ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు నిరంతర వాహన తనిఖీలు నిర్వహించి, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.








