తెలంగాణలో సర్పంచ్‌లకు కొత్త అధికారాలు
అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యత సర్పంచ్‌లకే
తెలంగాణ,ఆధాబ్ న్యూస్:
అక్రమాలను అరికట్టే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ పంచాయతీల సర్పంచ్‌లకు అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. పిల్లలు, గర్భిణులు, బాలింతలకు పౌష్టికాహారం సక్రమంగా అందేలా చూడటమే ఈ నిర్ణయం ప్రధాన లక్ష్యం.
గ్రామాల్లో గత రెండేళ్లుగా ఎన్నికైన పాలకవర్గాలు లేకపోవడంతో అంగన్వాడీ కేంద్రాల పర్యవేక్షణ పూర్తిగా గాడితప్పిందని ప్రభుత్వం గుర్తించింది. ఈ సమయంలో పౌష్టికాహారం పక్కదారి పడుతున్న ఘటనలు చోటుచేసుకున్నట్లు నివేదికలు రావడంతో, తాజాగా కొలువుదీరిన పంచాయతీ పాలకవర్గాలకు ఈ బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించింది.
ఈ క్రమంలో ప్రతి గ్రామంలో సర్పంచ్ ఛైర్మన్‌గా 11 మంది సభ్యులతో ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయనున్నారు. అంగన్వాడీ టీచర్ కన్వీనర్‌గా వ్యవహరించగా, ఏఎన్ఎం, ప్రభుత్వ పాఠశాల సైన్స్ టీచర్, ఒక రిటైర్డ్ ఉద్యోగి, చిన్నారుల తల్లులు కమిటీ సభ్యులుగా ఉంటారు.
ఈ కమిటీ ప్రతి నెలా అంగన్వాడీ కేంద్రాల్లో అందుతున్న బియ్యం, పప్పులు, బాలామృతం, గుడ్లు, పాలు వంటి పౌష్టికాహార సరుకుల నాణ్యత, పంపిణీని తనిఖీ చేయనుంది. అలాగే ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా గర్భిణులు, బాలింతలకు అందుతున్న భోజనాన్ని కూడా పర్యవేక్షిస్తుంది.
లక్షల రూపాయల విలువైన పౌష్టికాహారం అర్హులైన లబ్ధిదారులకు సక్రమంగా చేరేలా చూడటం, అక్రమాలకు చెక్ పెట్టడమే ఈ కమిటీ ప్రధాన బాధ్యతగా ప్రభుత్వం పేర్కొంది.









