హెల్మెట్ ధారణతోనే ప్రాణ రక్షణ: మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య
భద్రాచలం,ఆధాబ్ న్యూస్:
“తల మీదే – రక్షణ మీదే” అనే సత్యాన్ని ప్రతి ద్విచక్ర వాహన చోదకుడు గుర్తించి తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలంటూ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ సంగం వెంకట పుల్లయ్య పిలుపునిచ్చారు. హెల్మెట్ ధారణ ద్వారానే విలువైన ప్రాణాలను కాపాడుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు.
జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా శుక్రవారం భద్రాచలం రవాణా శాఖ యూనిట్ కార్యాలయంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ వెంకట పుల్లయ్య, అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ బి. రాజశేఖర్ రెడ్డి, సిబ్బంది కలిసి కార్యాలయానికి వచ్చిన ప్రజల హెల్మెట్లకు “నన్ను ధరించి నిన్ను రక్షిస్తా” అనే నినాదంతో కూడిన రేడియం స్టిక్కర్లు అంటించి హెల్మెట్ ప్రాధాన్యతను వివరించారు.
ఈ సందర్భంగా వెంకట పుల్లయ్య మాట్లాడుతూ, ప్రతి ద్విచక్ర వాహన చోదకుడు నాణ్యమైన హెల్మెట్‌ను తలకు సరిగ్గా ధరించి, మెడ వద్ద బెల్ట్ క్లిప్‌ను బిగువుగా అమర్చుకుని ప్రయాణం చేయాలని సూచించారు. హెల్మెట్‌ను సక్రమంగా ధరిస్తే రోడ్డు ప్రమాదాల సమయంలో తలకు తీవ్రమైన గాయాలు తగలకుండా ప్రాణాలను కాపాడుకోవచ్చని తెలిపారు.
మనము జీవించి ఉంటేనే మన కుటుంబానికి రక్షణగా నిలబడగలమని పేర్కొంటూ, హెల్మెట్ ధారణను అలవాటుగా మార్చుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుడిపై ఉందన్నారు. కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు కూడా హెల్మెట్ ప్రాముఖ్యతను తెలియజేసి వారిని ఈ అలవాటుకు ప్రోత్సహించాలని కోరారు.
అలాగే సెల్‌ఫోన్ ఉపయోగిస్తూ వాహనాలు నడపడం, మద్యం మత్తులో, నిద్ర మత్తులో లేదా అతివేగంతో డ్రైవింగ్ చేయడం అత్యంత ప్రమాదకరమని హెచ్చరించారు. రోడ్డు భద్రత నియమాలను తప్పనిసరిగా పాటించి, రోడ్డు ప్రమాదాలను అరికట్టి తమతో పాటు ఇతర రోడ్డు వినియోగదారుల ప్రాణాలను కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ బి. రాజశేఖర్ రెడ్డి, ఏఎంవీఐ, కానిస్టేబుల్ ఎన్. శివయ్య, సిబ్బంది భీముడు, అలాగే వివిధ పనుల నిమిత్తం కార్యాలయానికి వచ్చిన ప్రజలు పాల్గొన్నారు.









