పూనుగండ్ల నుంచి మేడారం బయలుదేరిన పగిడిద్దరాజు పడగ
గోవిందరావుపేట,ఆధాబ్ న్యూస్:
మహబూబాబాద్ జిల్లా గంగారం మండల పరిధిలోని సమ్మక్క భర్త పూనుగండ్ల గ్రామం నుంచి పగిడిద్దరాజు పడగ మంగళవారం మేడారం సమ్మక్క–సారలమ్మ జాతరకు బయలుదేరింది. సుమారు 50 కిలోమీటర్ల అరణ్య మార్గం గుండా నాలుగో గోట్టు అర్రెం వంశీయుల ఆధ్వర్యంలో పగిడిద్దరాజు పడగను తీసుకువచ్చారు.
మంగళవారం రాత్రి గోవిందరావుపేట మండల పరిధిలోని లక్షింపురం గ్రామంలో పగిడిద్దరాజు పడగకు విడిది ఏర్పాటు చేశారు. బుధవారం ఉదయం అక్కడి నుంచి పగిడిద్దరాజు పడగ మళ్లీ బయలుదేరి, సాయంత్రం నాటికి మేడారంలోని పగిడిద్దరాజు గద్దెపై ఆసీనులు కానుంది.
లక్షింపురంలో పగిడిద్దరాజు పడగ రాక సందర్భంగా పూజారులు పెనక రాజేశ్వర్, పెనక సురేందర్, పెనక వెంకటేశ్వర్లు, పెనక సారయ్య, పెనక సత్యనారాయణ, పెనక సమ్మయ్య, పెనక యుద్దయ్య, పెనక కృష్ణయ్య, పెనక నరేష్ ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామ సర్పంచ్ జుమ్మి లాల్, ఉపసర్పంచ్ ఎట్టి వెంకటేష్‌తో పాటు గ్రామస్తులు భక్తిశ్రద్ధలతో ఘన స్వాగతం పలికారు.
సమ్మక్క–సారలమ్మ జాతర నేపథ్యంలో పగిడిద్దరాజు పడగ ప్రయాణం ఆదివాసీ సంప్రదాయాలకు ప్రతీకగా కొనసాగుతుందని భక్తులు పేర్కొన్నారు.









