మేడారం జాతర ప్రారంభం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కేసీఆర్ శుభాకాంక్షలు
హైదరాబాద్ ,ఆధాబ్ న్యూస్:
మేడారం సమ్మక్క–సారలమ్మ జాతర ప్రారంభం సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణ త్యాగానికి, ధిక్కారానికి ఆదివాసీ దేవతలు సమ్మక్క–సారలమ్మలు ప్రతీకలని కేసీఆర్ పేర్కొన్నారు. కొంగు బంగారమై భక్తుల కోరికలు తీర్చే తమ ఇలవేల్పులకు మొక్కులు తీర్చుకునేందుకు దేశం నలుమూలల నుంచి కోట్లాదిగా భక్తులు తరలివచ్చే మేడారం జాతర కుంభమేళాను తలపిస్తూ ఒక విశాల ఆధ్యాత్మిక కేంద్రంగా కొనసాగుతుందని ఆయన అన్నారు.
తెలంగాణ ఆదివాసీ, గిరిజన సమాజాల సబ్బండ కులాల సంస్కృతి, సంప్రదాయాలకు గత పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో పెద్దపీట వేసినట్లు కేసీఆర్ గుర్తు చేశారు. గోదావరి లోయ పరీవాహక ప్రాంతాల సమగ్ర అభివృద్ధితో పాటు ఆధ్యాత్మిక అభివృద్ధి కూడా సమాంతరంగా సాగిందని ఈ సందర్భంగా ఆయన స్మరించుకున్నారు.
అన్ని రంగాల్లో తెలంగాణ ప్రగతి తిరిగి పుంజుకుని, రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా, ఆనందంగా జీవించేలా సమ్మక్క–సారలమ్మ దేవతలు ఆశీర్వదించాలని కేసీఆర్ ఆకాంక్షించారు.









