ప్రతి క్షణం
ప్రజల పక్షం

  మారుమూల గిరిజన ప్రాంతంలో జాతీయ కబడ్డీ పోటీలు గర్వకారణం – రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

మారుమూల గిరిజన ప్రాంతంలో జాతీయ కబడ్డీ పోటీలు గర్వకారణం

– రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

పినపాక,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిర్వహిస్తున్న 69వ SGF అండర్–17 బాలుర జాతీయ కబడ్డీ పోటీలు విజయవంతంగా కొనసాగుతున్నాయి. శుక్రవారం జరిగిన మూడో రోజు ఉదయం, మధ్యాహ్నం సెషన్లలో జరిగిన ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన జట్లు హోరాహోరీగా తలపడుతూ క్రీడాభిమానులకు ఉత్సాహాన్ని నింపాయి.

మూడో రోజు పోటీలను తిలకించేందుకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార–పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం జడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రాంగణంలో మంత్రికి అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి,పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్లతో కలిసి కబడ్డీ మ్యాచ్‌లను ఆసక్తిగా వీక్షించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,
“కబడ్డీ వంటి సంప్రదాయ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణ, జట్టు భావం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయి. జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడం క్రీడాకారుల జీవితంలో కీలకమైన మలుపు. గెలుపు, ఓటమి రెండింటినీ సమానంగా స్వీకరించి క్రీడాస్ఫూర్తితో ముందుకు సాగాలి” అని సూచించారు.

మారుమూల గిరిజన ప్రాంతంలో జాతీయస్థాయి క్రీడా పోటీల నిర్వహణ గర్వకారణమని మంత్రి పేర్కొన్నారు. ఈ పోటీల్లో దేశవ్యాప్తంగా 32 రాష్ట్రాల నుంచి 384 మంది క్రీడాకారులు, 74 మంది కోచ్‌లు, జడ్జీలు పాల్గొనడం ఈ పోటీల ప్రాముఖ్యతను చాటుతోందన్నారు. పోటీలను ఎలాంటి లోటుపాట్లు లేకుండా విజయవంతంగా నిర్వహించిన జిల్లా యంత్రాంగం, క్రీడా శాఖ అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులను మంత్రి అభినందించారు.

ఈ సందర్భంగా పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు మాట్లాడుతూ,
“ఏడూళ్ల బయ్యారం వంటి మారుమూల గిరిజన ప్రాంతంలో జాతీయస్థాయి క్రీడా పోటీల నిర్వహణ చారిత్రక ఘట్టం. ఈ పోటీలతో గ్రామీణ, గిరిజన యువతలో క్రీడలపై ఆసక్తి మరింత పెరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం క్రీడలకు ఇస్తున్న ప్రోత్సాహం వల్లే ఇలాంటి పోటీలు మన ప్రాంతానికి వచ్చాయి” అని తెలిపారు.

జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ మాట్లాడుతూ,
“అన్ని శాఖల సమన్వయంతో క్రీడాకారుల భద్రత, వసతి, భోజనం, వైద్య సదుపాయాలు పక్కాగా ఏర్పాటు చేసి జాతీయస్థాయి పోటీలను సురక్షితంగా, ప్రశాంతంగా నిర్వహిస్తున్నాం” అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మెహబూబాబాద్ పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్, భద్రాచలం శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు, భద్రాచలం సబ్ కలెక్టర్ మృనాల్ శ్రేష్ట, విద్యాశాఖ అధికారి నాగలక్ష్మి, సర్పంచ్ చందర్రావు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!