జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం–2025పై సమీక్ష, శిక్షణ కార్యక్రమం
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో కుష్టు వ్యాధిగ్రస్తులను త్వరితగతిన గుర్తించి సమర్థవంతమైన చికిత్స అందించేందుకు చేపట్టిన **“కుష్టు వ్యాధిగ్రస్తుల గుర్తింపు ఉద్యమం–2025”**పై జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి కార్యాలయంలో సమీక్ష సమావేశం, శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, నోడల్ అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, శరీరంపై రాగి వర్ణంలో లేదా చర్మ రంగుకంటే తక్కువ రంగులో మచ్చలు కనిపించి, ఆ మచ్చలపై స్పర్శ (సెన్సేషన్) లేకపోతే కుష్టు వ్యాధిగా అనుమానించి వెంటనే సమీప ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించాలని సూచించారు. ఈ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో అంగవైకల్యం ఏర్పడి కుటుంబానికి భారంగా మారే ప్రమాదం ఉందని ప్రజలను అప్రమత్తం చేశారు.
ఈ గుర్తింపు ఉద్యమం ఈ నెల 18 నుంచి 31 తేదీల వరకు 14 రోజులపాటు నిర్వహించనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో ఆశ కార్యకర్తలు ఉదయం 7 నుంచి 9 గంటల వరకు ప్రతి ఇంటిని సందర్శించి ప్రతి వ్యక్తిని పరిశీలించనున్నారు. సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలని ఆశ కార్యకర్తలను కోరారు.
ప్రస్తుతం జిల్లాలో 45 కుష్టు వ్యాధి కేసులు గుర్తించి వారికి ఉచితంగా మందులు అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా ఏర్పాటు నుంచి ఇప్పటివరకు మొత్తం 582 కేసులు గుర్తించగా, అందులో 532 మంది పూర్తిగా చికిత్స పొంది ఆరోగ్యవంతులుగా మారినట్లు వివరించారు.
ఈ గుర్తింపు ఉద్యమంలో మొత్తం 2,29,336 ఇండ్లను 1,407 మంది ఆశ కార్యకర్తలు సందర్శించనున్నారు. గత మార్చి నెలలో నిర్వహించిన గుర్తింపు ఉద్యమంలో ఇదే సంఖ్యలో గృహాలను సందర్శించి 1,702 అనుమానిత కేసులు గుర్తించగా, అందులో 25 మందికి కుష్టు వ్యాధి నిర్ధారణ చేసి చికిత్స అందించినట్లు తెలిపారు.
గత సంవత్సరాల వారీగా గుర్తించిన కుష్టు వ్యాధి కేసులు:
2019 – 62 కేసులు
2022–23 – 38 కేసులు
2023–24 – 36 కేసులు
2024 – 25 కేసులు
ఈ సమావేశంలో డిప్యూటీ డీఎంహెచ్వో జయలక్ష్మి మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధిగా సమయపాలన పాటించాలని సూచించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో అటెండెన్స్ రిజిస్టర్, మూమెంట్ రిజిస్టర్లను తప్పనిసరిగా నిర్వహించాలని, అలాగే గర్భిణీ స్త్రీల ప్రసవ క్యాలెండర్లను సక్రమంగా నిర్వహించి ప్రమాదకర గర్భిణీలను ముందస్తుగా గుర్తించి అవసరమైతే ఆసుపత్రిలో చేర్పించాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ తుకారం రాథోడ్, ఏవో ప్రసాద్, NLEP ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ పుల్లారెడ్డి, బద్రు పీటీ, మోహన్ డీపీఎం, డీపీఓ సరిత, జిల్లా వైద్యాధికారులు, నోడల్ పర్సన్స్ తదితరులు పాల్గొన్నారు.









