కరకగూడెం,ఆధాబ్ న్యూస్: రాబోయే గ్రామ పంచాయతీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని కరకగూడెం పోలీస్ శాఖ గ్రామాల్లో శాంతి భద్రతలు పరిశీలించింది. ఈ సందర్భంగా ఏడుల్లా బయ్యారం సీఐ వి. వెంకటేశ్వరరావు, కరకగూడెం ఎస్‌ఐ పీ.వి.ఎన్.రావు పోలీస్ సిబ్బందితో కలిసి సమత్ భట్టుపల్లి, భట్టుపల్లి గ్రామాలను సందర్శించారు.
గ్రామ ప్రజలతో మాట్లాడిన అధికారులు ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు ప్రజలు, అభ్యర్థులు పోలీసులకు పూర్తి సహకారం అందించాలని సూచించారు. అధికారులు తెలిపిన ముఖ్య సూచనలు ఇలా ఉన్నాయి:
1. ఎన్నికలు ఎటువంటి ఉద్రిక్తతలు లేకుండా జరగాలని ప్రతి గ్రామస్తుడు తన వంతు సహకారం అందించాలి.
2. అనవసర గొడవలు, ఒకరినొకరు దూషించే చర్యలు చేయరాదు. అలాంటి వారి పై చట్టపరమైన చర్యలు తప్పవు అని హెచ్చరించారు.
3. ఎన్నికల రోజున విజయోత్సవ ర్యాలీలు పూర్తిగా నిషేధం. ఎవరు నిర్వహించినా వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
4. అభ్యర్థులు ఓటర్లను బెదిరించడం, ప్రలోభపరచడం నేరం. అలాంటి చర్యలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తప్పవని తెలిపారు.
5. పోలింగ్ కేంద్రాలు లేదా డిస్ట్రిబ్యూషన్ సెంటర్ల వద్ద అల్లర్లు సృష్టించే ప్రయత్నాలు ఏవీ సహించబడవు. వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద 163 BNSS (144 CRPC) అమలులో ఉంటుందని, ఎవరు గుంపులుగా నిలవకూడదని ప్రజలకు సూచించారు.
గ్రామాల్లో శాంతిభద్రతలు, నిబంధనల అమలులో ప్రజలు, అభ్యర్థులు పోలీసులకు పూర్తిస్థాయిలో సహకరించాలని సీఐ వెంకటేశ్వరరావు కోరారు. ఈ కార్యక్రమంలో సీఐతో పాటు ఎస్‌ఐ పీ.వి.ఎన్.రావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.









