ప్రతి క్షణం
ప్రజల పక్షం

  ఆదివాసీల సాగులో ఉన్న పోడు భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలి – ఏఐకేఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదన్న నవంబర్ 17న పాల్వంచలో జరగబోయే ర్యాలీ, సదస్సును విజయవంతం చేయాలని పిలుపు

ఆదివాసీల సాగులో ఉన్న పోడు భూములన్నింటికీ పట్టాలు ఇవ్వాలి – ఏఐకేఎంకేఎస్ రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదన్న

నవంబర్ 17న పాల్వంచలో జరగబోయే ర్యాలీ, సదస్సును విజయవంతం చేయాలని పిలుపు

భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
ఆదివాసీల సాగులో ఉన్న పోడు భూములకు వెంటనే పట్టాలు మంజూరు చేయాలని, ఆదివాసి గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని తెలంగాణ రైతు కూలీ సంఘం (ఏఐకేఎంకేఎస్) రాష్ట్ర అధ్యక్షులు ప్రసాదన్న డిమాండ్ చేశారు.

బుధవారం పాల్వంచ పట్టణంలో జరిగిన ఏఐకేఎంకేఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ — “తరతరాలుగా అడవులపై ఆధారపడి జీవిస్తున్న ఆదివాసులకు ఇప్పటికీ భూమిపై హక్కులు కల్పించకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనం. షెడ్యూల్‌డ్ ప్రాంతాలకు సంబంధించిన చట్టాలు ఉన్నప్పటికీ వాటిని అమలు చేయడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయి,” అన్నారు.

గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రారంభమైన ఫారెస్ట్‌శాఖ అధికారుల పోడు భూముల ఆక్రమణలు, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో కూడా కొనసాగుతున్నాయని ఆయన విమర్శించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో ఫారెస్ట్ అధికారులు ఆదివాసీల సాగు భూములను ధ్వంసం చేస్తూ, రోడ్లు, కరెంటు, మంచినీరు వంటి మౌలిక వసతుల అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.

భద్రాద్రి కొత్తగూడెం నుండి ఆదిలాబాద్ వరకు గోదావరి పరివాహక ప్రాంతంలో 25–30 సంవత్సరాలుగా “గోండు” తెగ ఆదివాసీలు పోడు భూములపై ఆధారపడి జీవిస్తున్నప్పటికీ, వారిని “గొత్తి కోయలు” అని సంబోధిస్తూ పట్టాలు ఇవ్వకపోవడం రాజ్యాంగ విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

“భారత రాజ్యాంగంలోని ఐదవ షెడ్యూల్ ప్రాంతాల్లో ఉన్న ఆదివాసులకు చట్టబద్ధ హక్కులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేసి, ఫారెస్ట్ హక్కుల కమిటీల సర్వే చేసిన అన్ని పోడు భూములకూ తక్షణమే పట్టాలు ఇవ్వాలి,” అని ఆయన డిమాండ్ చేశారు.

ఆదివాసి చట్టాలను కచ్చితంగా అమలు చేయడంతోపాటు గ్రామాలకు రోడ్లు, విద్యుత్, మంచినీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన కోరారు. నవంబర్ 17న పాల్వంచలో జరగనున్న ఆదివాసి ర్యాలీ, సదస్సును విజయవంతం చేయాలని ఆదివాసులు, ప్రజాస్వామిక వాదులు, రైతు కూలీలు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు కూలీ సంఘం జిల్లా ఉపాధ్యక్షులు కుంజ వెంకటేశ్వర్లు, ప్రసాద్, మడివి దేవయ్య, మడకం దేవయ్య, మడివి సోమయ్య, కొర్స వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!