దివ్యాంగుల చట్టం-2016 పోస్టర్లను ఆవిష్కరించిన భద్రాద్రి జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్: భద్రాద్రి ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో దివ్యాంగుల చట్టం 2016పై అవగాహన కల్పించేందుకు రూపొందించిన పోస్టర్లను జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎస్పీ కార్యాలయంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ…
దివ్యాంగులను కించపరచడం, అవహేళన చేయడం, అవయవ లోపాలను ఎగతాళి చేయడం, అవమానకరంగా ప్రవర్తించడం, వారి పరికరాలను ధ్వంసం చేయడం వంటి చర్యలు దివ్యాంగుల చట్టం 2016లో నేరంగా పరిగణిస్తారని తెలిపారు.
ఈ నేరం రుజువైతే 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష, అలాగే రూ.10 వేల నుండి రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారని వివరించారు. సమాజంలో దివ్యాంగులను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. త్వరలోనే జిల్లా అధికారులతో కలిసి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహిస్తామని తెలిపారు.
కార్యక్రమంలో వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు ఊటుకూరి సాయిరాం, కార్యదర్శి అన్నం సత్తిబాబు, ఉపాధ్యక్షుడు కిష్టా శ్రీనివాస రావు వాల్మీకి, సామాజిక ఉద్యమ నాయకులు అలవాలరాజా పెరియార్, పరివర్తన యశోద ఫౌండేషన్ సేవా సమితి అధ్యక్షుడు కొమ్మగిరి వెంకటేశ్వర్లు, అప్పన్న దాసు బాబు, మద్దెల లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.
— భద్రాద్రి ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వెల్ఫేర్ సొసైటీ, భద్రాచలం









