నకిలీ వే బిల్లులతో ఇసుక అక్రమ రవాణా – నిందితుల అరెస్టు
భద్రాద్రి కొత్తగూడెం, అక్టోబర్ 16 (ఆధాబ్ న్యూస్):
జగ్గారం ఎక్స్ రోడ్ వద్ద అక్రమ ఇసుక రవాణాపై పోలీసులు చేసిన తనిఖీల్లో నకిలీ వే బిల్లులతో ఇసుక రవాణా చేస్తున్న ముఠా బయటపడింది. ఈ ఘటనపై అశ్వాపురం పోలీసులు కేసు నమోదు చేసి పలువురిని అరెస్టు చేశారు.
అశ్వాపురం పోలీస్ స్టేషన్ వివరాల ప్రకారం — అక్టోబర్ 8న TS30TA6498 నంబర్ గల లారీని తనిఖీ చేయగా, డ్రైవర్ నాతి రాములు చూపించిన వే బిల్ నకిలీదని తేలింది. విచారణలో, ఆ వే బిల్‌ను లారీ యజమాని హైదరాబాద్‌కి చెందిన కర్నాటి శివశంకర్ ఇచ్చినట్టు తెలిపాడు. రామానుజవరం ర్యాంప్‌లో డీడీ లేకుండానే ఇసుకను లోడ్ చేసినట్టు కూడా ఒప్పుకున్నాడు.
దీనిపై పోలీసులు లారీని స్వాధీనం చేసుకుని Cr. No.189/2025 U/Sec 318(4), 336(2), 340(2), r/w 3(5) of BNS కింద కేసు నమోదు చేశారు. రామానుజవరం ఇసుక ర్యాంపులో పనిచేస్తున్న TGMDC ఉద్యోగులు దగ్గు నిఖిల్ దీప్, నాగేల్లి మధు, బోల్లేదు అనిల్ లు ఇసుకను అక్రమంగా లోడ్ చేసినట్టు తేలింది. జేసీబీ డ్రైవర్ ఇరగదిండ్ల ఉపేందర్ కూడా ఈ అక్రమ రవాణాలో పాల్గొన్నట్టు నిర్ధారించారు.
అలాగే ర్యాంప్ సూపర్వైజర్ సతీష్ రెడ్డి ఫోన్ ద్వారా డ్రైవర్‌కు లోడ్ చేయమని ఆదేశించినట్టు వెల్లడైంది. విచారణలో హైదరాబాద్ హయత్‌నగర్‌కు చెందిన కర్నాటి శివశంకర్ నేరాన్ని ఒప్పుకొని, వే బిల్లులు తానే తయారు చేస్తానని తెలిపాడు. పోలీసులు అతని వద్ద నుంచి ల్యాప్‌టాప్, ప్రింటర్, రామానుజవరం ర్యాంప్ స్టాంప్‌ను స్వాధీనం చేసుకున్నారు.
శివశంకర్ వే బిల్లులు తయారు చేయడం నేర్పింది తన స్నేహితుడు కిరణ్ అని, అతను 2023లో వరంగల్ జిల్లా మట్వాడ పోలీస్ స్టేషన్లో నకిలీ వే బిల్లుల కేసులో జైలుకు వెళ్లినట్టు తెలిపాడు.
అరెస్టయిన వారు:
A1: కర్నాటి శివశంకర్ (34), లారీ ఓనర్, యాదాద్రి-భువనగిరి జిల్లా.
A4: నాతి రాములు (42), డ్రైవర్, యాదాద్రి-భువనగిరి జిల్లా.
A5: ఇరగదిండ్ల ఉపేందర్ (35), జేసీబీ డ్రైవర్, మహబూబాబాద్ జిల్లా.
A6: దగ్గు నిఖిల్ దీప్ (29), TGMDC ఉద్యోగి, హన్మకొండ జిల్లా.
A7: నాగేల్లి మధు (38), TGMDC ఉద్యోగి, మహబూబాబాద్ జిల్లా.
A8: బోల్లేదు అనిల్ (41), సెక్యూరిటీ గార్డ్, మహబూబాబాద్ జిల్లా.
పరారీలో ఉన్నవారు:
A2 – ఈ.కిరణ్ (నకిలీ వే బిల్లు తయారీదారు)
A3 – సతీష్ రెడ్డి (ర్యాంప్ సూపర్వైజర్)
A9 – సుర్వే శ్రీకాంత్ (లారీ ఓనర్)
పోలీసులు ఈ కేసులో ఇంకా కొంతమంది నిందితులు అరెస్టు కావాల్సి ఉన్నట్లు తెలిపారు. నకిలీ వే బిల్లులు లేదా ఇసుక అక్రమ రవాణా విషయంపై ఎవరికి సమాచారం తెలిసినా అశ్వాపురం SHO (8712682093) లేదా SDPO మణుగూరు (8712682006) నంబర్లను సంప్రదించవచ్చని విజ్ఞప్తి చేశారు.









