ధాన్యం దిగుబడిలో తెలంగాణ ఆల్ టైమ్ రికార్డ్
148.03 లక్షల మెట్రిక్ టన్నులతో చరిత్ర సృష్టి – మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి
హైదరాబాద్,ఆధాబ్ న్యూస్:
తెలంగాణ రాష్ట్రం ఈ వానాకాలంలో ధాన్యం దిగుబడిలో కొత్త చరిత్ర సృష్టించింది. రాష్ట్రవ్యాప్తంగా 148.03 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తితో ఇప్పటివరకు ఎప్పుడూ లేని స్థాయికి తెలంగాణ చేరుకుంది. ఈ రికార్డు రైతుల కష్టానికి నిదర్శనమని రాష్ట్ర నీటిపారుదల, పౌర సరఫరాల శాఖ మంత్రి కెప్టెన్ ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సచివాలయంలో ఈరోజు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో రాష్ట్రవ్యాప్తంగా జిల్లా కలెక్టర్లతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, పౌర సరఫరాల కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, అధిక దిగుబడి దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండి ధాన్యం కొనుగోళ్లు సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా మౌలిక సదుపాయాలు, రవాణా వసతులు కల్పించాలని సూచించారు.రైతులు ఎక్కడా నిరీక్షించాల్సిన పరిస్థితి లేకుండా తక్షణ చర్యలు తీసుకోవాలి. కొనుగోలు వివరాలను వెంటనే నమోదు చేసి 48 గంటల్లో చెల్లింపులు జరిగేలా చూడండి. ఎటువంటి సమస్యలు వచ్చినా నన్ను లేదా పౌర సరఫరాల కమిషనర్‌ను వెంటనే సంప్రదించండి. మేము 24 గంటలు అందుబాటులో ఉంటాం,” అని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.
మంత్రి పేర్కొంటూ, ధాన్యం తరలింపు, నిల్వ, మిల్లర్లతో సమన్వయం విషయంలో జిల్లా అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు. రైతులకు మద్దతు ధరతో పాటు బోనస్ చెల్లింపులకూ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు.
జిల్లాల స్థాయిలో సిద్ధతలు:
వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్ క్యాంపు కార్యాలయం నుండి పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, ఈ వానాకాలం ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖలతో సమన్వయం కల్పించామని తెలిపారు.
జిల్లాలో మొత్తం 193 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయగా, సుమారు 2,38,177 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు జరుగుతుందని అంచనా వేశారు.
రైతులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా తాగునీరు, విశ్రాంతి గదులు, తూకం యంత్రాలు, తడిపరీక్ష పరికరాలు వంటి మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉంచామని చెప్పారు. అలాగే కొనుగోలు చేసిన ధాన్యాన్ని వేగంగా తరలించేందుకు రవాణా వసతులు, నిల్వ గోదాములు, మిల్లర్లతో సమన్వయం చర్యలు చేపట్టామని వివరించారు.
ధాన్యం విక్రయించిన రైతులకు 48 గంటల్లోపే చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ తెలిపారు.
సమావేశంలో పాల్గొన్నవారు:
స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, పౌర సరఫరాల అధికారి రుక్మిణి, మరియు సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.









