కొత్తగూడెంకు మంజూరైన కేంద్రీయ విద్యాలయ పనులు సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ జితేష్ వి. పాటిల్ ఆదేశం
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం పనులను నిర్ణీత కాలవ్యవధిలో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు.
కొత్తగూడెంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆనందఖనిలో తాత్కాలిక తరగతి గదుల కోసం కేటాయించిన భవన సముదాయాన్ని ఆయన సోమవారం పరిశీలించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, కేంద్రీయ విద్యాలయ సంఘటన్ సూచించిన మార్పులు, మరమ్మతులు తక్షణం చేపట్టాలని, వాటి కోసం ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేసి సమర్పించాలన్నారు.
పనులు వేగంగా పూర్తి అయ్యేలా చర్యలు తీసుకొని, వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే కేంద్రీయ విద్యాలయ తరగతులు ప్రారంభమయ్యేలా చూడాలని జిల్లా విద్యాశాఖ అధికారులకు సూచించారు.
ఈ పర్యటనలో జిల్లా విద్యాశాఖ అకాడమిక్ మానిటరింగ్ అధికారి ఏ. నాగరాజశేఖర్, విద్యాశాఖ ఇంజినీరింగ్ విభాగ అధికారి రాజగోపాల్ పాల్గొన్నారు.
తరువాత కలెక్టర్ పక్కనే ఉన్న పట్టణ గురుకుల పాఠశాల (బాలురు)ను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. పిల్లలకు ఏవైనా అవసరాలు ఉంటే తనకు తెలియజేయాలని స్పెషల్ ఆఫీసర్‌ను ఆదేశించారు.









