రోడ్డు ప్రమాద బాధితుడికి రూ.కోటి పరిహారం – అంబులెన్సులోనే జడ్జి విచారణ
ములుగు,ఆధాబ్ న్యూస్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన యువకుడికి జాతీయ లోక్ అదాలత్‌లో రూ.కోటి పరిహారం చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించారు. ఈ సందర్భంగా బాధితుడు ఉన్న అంబులెన్స్ వద్దకే వెళ్లి జడ్జి విచారణ జరపడం విశేషంగా మారింది.
ములుగు జిల్లా వెంకటాపురం గ్రామానికి చెందిన జాపతి వెంకటేశ్వర్లు పురుగుమందుల దుకాణంలో గుమాస్తాగా, ఆయన భార్య పద్మ రైతు కూలీగా పని చేస్తున్నారు. వీరికి ఇద్దరు సంతానం. చిన్న కుమారుడు జాపతి దీక్షిత్ (22) బాచుపల్లిలో ఇంజినీరింగ్ రెండో సంవత్సరం చదువుతున్నాడు. 2023 ఆగస్టు 12న స్నేహితులతో కలిసి అద్దెకారు తీసుకుని అనంతగిరి హిల్స్ విహార యాత్రకు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో దీక్షిత్ తలకు తీవ్ర గాయమై శరీరం చచ్చుబడిపోయింది.
బాధితుడి చికిత్స కోసం తల్లిదండ్రులు సుమారు రూ.60 లక్షలు అప్పులు చేసి హైదరాబాద్‌లోని ప్రైవేట్ ఆసుపత్రిలో వైద్యం అందించారు. అనంతరం గో డిజిట్ ఇన్సూరెన్స్ సంస్థపై రూ.1.50 కోట్ల పరిహారం కోరుతూ కోర్టులో కేసు వేశారు.
శనివారం జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో ఈ కేసు విచారణకు వచ్చింది. బాధితుడు అంబులెన్స్‌లోనే ఉన్నట్లు తెలుసుకున్న న్యాయ సేవాసమితి చైర్‌పర్సన్, 12వ అదనపు చీఫ్ జడ్జి షౌకత్ జహాన్ సిద్దిఖీ నేరుగా అక్కడికే వెళ్లి వివరాలు సేకరించారు. అనంతరం నెలరోజుల్లోపు రూ.కోటి పరిహారం బాధితుడి ఖాతాలో జమ చేయాలని బీమా సంస్థను ఆదేశించారు. దీనికి బీమా సంస్థ ప్రతినిధులు అంగీకరించారు.









