సస్పెన్షన్ ఎత్తివేసిన పోలీస్ శాఖ: టేకులపల్లి సీఐగా బత్తుల సత్యనారాయణ పునర్నియామకం
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
ఆడపిల్లకు న్యాయం చేయాలన్న నిస్వార్థ ప్రయత్నంలో తప్పుడు ఆరోపణలతో సస్పెండ్ అయిన సీఐ బత్తుల సత్యనారాయణకు న్యాయం జరిగింది. పోలీసు శాఖ చేపట్టిన సమగ్ర విచారణలో ఆయన నిజాయితీకి ముద్రపడింది. దీంతో ఆయనపై విధించిన సస్పెన్షన్‌ను అధికారులు ఎత్తివేశారు.
తాజాగా ఆయనను టేకులపల్లి పోలీస్ స్టేషన్‌కు సీఐగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఇంతకు ముందు ఇల్లందు సీఐగా పనిచేసిన సత్యనారాయణపై కొంతమంది అధికారుల దుష్ప్రచారంతో తప్పుడు ఆరోపణలు వచ్చాయని స్థానికులు తెలిపారు.
ప్రజల హర్షాతిరేకం:
ఈ నిర్ణయంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. “న్యాయానికి పోరాడిన వ్యక్తికి చివరికి న్యాయం జరిగిందన్నది తృప్తికర విషయమని” స్థానికులు అన్నారు. బత్తుల సత్యనారాయణ తన బాధ్యతల్లో ఎలాంటి తప్పూ చేయలేదని విచారణలో తేలడంతో, ఆయన పట్ల విధించిన చర్యను అధికారులు వెనక్కి తీసుకున్నారు.
యాదవ సమాజం కృతజ్ఞతలు:
ఈ సందర్భంగా భారత యాదవ సమితి తరపున దాసరి నాని యాదవ్ మాట్లాడుతూ – “సత్యనారాయణ వంటి నిజాయితీ గల అధికారులకు ప్రభుత్వ పరిరక్షణ ఉండడం పట్ల తెలంగాణ మొత్తం గర్వించగలదు,” అని అన్నారు. ప్రభుత్వానికి, పోలీస్ శాఖకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.









