వర్షాకాలంలో విష జ్వరాలే కాదు… విష సర్పాల పట్ల కూడా జాగ్రత్తలు తీసుకోండి: డాక్టర్ దుర్గాభవాని
పినపాక,ఆధాబ్ న్యూస్: వర్షాకాలంలో భారీ వర్షాలు కురవడం వల్ల విష జ్వరాలు మినహాయించకుండా విష సర్పాలు కూడా ఎక్కువగా సంచరిస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పినపాక ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యురాలు డాక్టర్ దుర్గాభవాని సూచించారు.
మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, కరకగూడెం మండలం పద్మాపురం గ్రామానికి చెందిన 18 నెలల బాలుడు ఊకే విక్రమ్ పాము కాటుకు గురయ్యాడని, తల్లిదండ్రులు వెంటనే పినపాక ఆరోగ్య కేంద్రానికి తీసుకురావడంతో ప్రాథమిక చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మణుగూరు ఏరియా హాస్పిటల్‌కు తరలించామని తెలిపారు.
పాముకాటు వంటి పరిస్థితుల్లో జనం భయపడకుండా వెంటనే దగ్గరలోని ఆరోగ్య కేంద్రాన్ని సంప్రదించాలని, మూఢనమ్మకాలను నమ్మవద్దని హెచ్చరించారు. అనారోగ్య లక్షణాలు ఉన్నప్పుడల్లా ఆరోగ్య కేంద్రం గాని, లేదా స్థానిక ఆశా కార్యకర్తను సంప్రదించాలని ఆమె సూచించారు.
జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ప్రాణాలు రక్షించుకోవచ్చని డాక్టర్ దుర్గాభవాని పేర్కొన్నారు.









