అమ్మ మాట – అంగన్వాడి బాట కార్యక్రమాన్ని విజయవంతం చేద్దాం: జిల్లా సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్ :
ఈ నెల 10వ తేదీ నుంచి 17వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించబోయే “అమ్మ మాట – అంగన్వాడి బాట” కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనీనా పిలుపునిచ్చారు. సోమవారం నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశంలో ఆమె మాట్లాడారు.
అంగన్వాడి కేంద్రాలు పాఠశాలల కంటే వెనుకకాకుండా ఉండేలా, పిల్లల చదువు మరియు ఆరోగ్యం రెండు అంశాలపై సమాన దృష్టి పెట్టాల్సిన అవసరముందని ఆమె పేర్కొన్నారు. ముఖ్యంగా మొదటి రోజు (జూన్ 10న) అంగన్వాడి కేంద్రాలకు వచ్చే పిల్లల తల్లిదండ్రులతో సెల్ఫీ పాయింట్లు ఏర్పాటు చేసి, జ్ఞాపకంగా ఫోటోలు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అంగన్వాడి కేంద్రాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడమే కాకుండా, పెరటి తోటలు, పోషణ వాటికలు ఏర్పాటు చేయాలని, కేంద్రాల్లో వచ్చే పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు పోషకాహారం విలువలపై అవగాహన కల్పించాలని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇందిరమ్మ అమృతం పథకం జిల్లాలోనే మొదటగా ప్రారంభించడంపై సంతోషం వ్యక్తం చేశారు.
సామూహిక అక్షరాభ్యాసం, తల్లిదండ్రులతో అవగాహన ర్యాలీలు, ఆరోగ్య పరీక్షలు, అనీమియా నివారణ కార్యక్రమాలు వంటి అంశాల్లో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో కేంద్రాల శ్రమను సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పారు. మూడు సంవత్సరాల పైబడిన ప్రతి చిన్నారి అంగన్వాడి కేంద్రాల్లో చేరేలా చర్యలు తీసుకోవాలన్నారు.
ఆరోగ్య సమాచారాన్ని తల్లిదండ్రులకు వివరించాలి, పిల్లల ఎత్తు, బరువు తరచుగా చెక్ చేయాలి, ప్రీ-స్కూల్ కిట్లు అందుబాటులో ఉంచాలి అని సూచించారు. అంతేకాకుండా విద్యుత్, నీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని ఆమె స్పష్టం చేశారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాష్ట్రంలో అత్యధిక అంగన్వాడి ప్రాజెక్టులు కలిగిన జిల్లా కావడంతో, ఇది ఆదర్శ జిల్లా కావాలని, ప్రతి కేంద్రం ద్వారా ఆ లక్ష్యాన్ని చేరుకోవాలని ఆమె పిలుపునిచ్చారు.









