బంగారు షాపులో చోరీ చేసిన అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
మణుగూరు, ఆధాబ్ న్యూస్: మణుగూరు పట్టణంలోని మెయిన్ రోడ్‌లో ఉన్న శ్రీవారి జువెలర్స్ షాపులో చోటుచేసుకున్న బంగారు ఆభరణాల దొంగతనాన్ని మణుగూరు పోలీసులు క్షణాల్లో చేదించారు. తేది 23.05.2025 మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి మాస్క్ ధరించి షాపులోకి ప్రవేశించి, అక్కడ ఒంటరిగా ఉన్న మహిళా సిబ్బందితో మాటల్లో పెట్టి, సుమారు 132 గ్రాముల బంగారు ఆభరణాలతో కూడిన బాక్స్‌ను దొంగిలించి పరారయ్యాడు.
ఈ ఘటనపై బాధిత షాపు యజమాని దేవతా శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మణుగూరు డీఎస్పీ రవీందర్ రెడ్డి పర్యవేక్షణలో E బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, మణుగూరు ఎస్‌ఐ ప్రసాద్, సీసీఎస్ ఎస్‌ఐ రామారావులు బృందాలుగా ఏర్పడి దర్యాప్తు చేపట్టారు.
సీసీటీవీ ఫుటేజ్ పరిశీలన, లాడ్జిల తనిఖీ తదితర సూచనల ఆధారంగా నిన్న (27.05.2025) హనుమాన్ టెంపుల్ సమీపంలో వాహన తనిఖీలు చేస్తున్న సమయంలో ఒక అనుమానాస్పద వ్యక్తి పోలీసులను చూసి పారిపోగా, పోలీసులు వెంటాడి పట్టుకున్నారు. విచారణలో అతను గొర్రెల సత్యనారాయణ, వయస్సు సుమారు 35 ఏళ్లు, ఆకివీడు, భీమవరం జిల్లా (ఆంధ్రప్రదేశ్)కి చెందిన వాడిగా గుర్తించారు.
అతను మణుగూరు శ్రీవారి జువెలర్స్‌లో బంగారు చోరీ చేసిన విషయాన్ని అంగీకరించి, దొంగతనానికి ఉపయోగించిన బంగారు చైన్లు – 6, నల్లపూసల గొలుసు – 1, బేబీ రింగ్స్ – 5 (మొత్తం బరువు సుమారు 132 గ్రాములు)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అదేక్రమంలో, వరంగల్‌లోని సాయి గణేష్ జువెలర్స్ నుంచి దొంగిలించిన చిన్న బంగారు చెవికమ్మలు – 20 జతలు (సుమారు 30 గ్రాములు)నూ చూపించాడు.
ప్రాధమిక దర్యాప్తులో గొర్రెల సత్యనారాయణపై రెండు రాష్ట్రాల్లో 35కి పైగా బంగారు దొంగతనాల కేసులు నమోదైనట్టు తెలిసింది. మణుగూరు, వరంగల్, తిరుపతి, కర్నూలు తదితర ప్రాంతాల్లోనూ అతడు దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నాడు. నిందితుడిని ఈరోజు మణుగూరు కోర్టులో హాజరుపరిచారు.
ఈ కేసు విజయవంతంగా ఛేదించిన E బయ్యారం సీఐ వెంకటేశ్వర్లు, మణుగూరు ఎస్‌ఐ ప్రసాద్, సీసీఎస్ ఎస్‌ఐ రామారావు, మణుగూరు సిబ్బంది రామారావు, బాలు, సీసీఎస్ సిబ్బంది వెంకట నారాయణ, విజయ్ లను డీఎస్పీ అభినందించారు.
ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి ప్రజలకు సూచిస్తూ – ఇటీవల దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్న నేపథ్యంలో ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలను నిర్లక్ష్యంగా వదలవద్దని, ప్రయాణాలకు వెళ్లే ముందు స్థానిక పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇవ్వాలని, అలాగే ప్రతి ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.









