ప్రతి క్షణం
ప్రజల పక్షం

  సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్: ధాన్యం కొనుగోలు, విత్తనాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై సమీక్ష

సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్: ధాన్యం కొనుగోలు, విత్తనాల పంపిణీ, ఇళ్ల నిర్మాణంపై సమీక్ష

హైదరాబాద్, ఆధాబ్ న్యూస్:
రాష్ట్రవ్యాప్తంగా కురిసిన ముందస్తు రుతుపవనాల మధ్య పలు కీలక అంశాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో ధాన్యం కొనుగోలు, విత్తనాలు, ఎరువులు, భూభారతి చట్టం, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం, రాష్ట్రీయ ఆవిర్భావ దినోత్సవ ఏర్పాట్లపై సమీక్ష చేపట్టారు.

ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.

ధాన్యం కొనుగోలు రికార్డు స్థాయిలో: ఈసారి రుతుపవనాలు 15 రోజుల ముందే వచ్చినట్టు సీఎం తెలిపారు. ఇప్పటివరకు 64.5 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు అయిందని, ఇది రాష్ట్ర చరిత్రలో తొలిసారి జరిగిందన్నారు. 90 శాతం ధాన్యం సేకరణ ఇప్పటికే పూర్తైందని వెల్లడించారు.

రైతులకు రూ. 12,184 కోట్లు చెల్లింపు: ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని తెలిపారు. కొన్నిచోట్ల జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఖండిస్తూ, కలెక్టర్లు ధాన్యం కొనుగోలు వివరాలు ప్రజలకు వివరించాలన్నారు. అవసరమైతే లోకల్ గోదాములు అద్దెకు తీసుకోవాలన్నారు.

వర్షపాతం, వ్యవసాయ శాఖకు సూచనలు: ఈసారి వర్షపాతం 29 శాతం అధికంగా నమోదైందని తెలిపారు. అధికారులు అప్రమత్తంగా ఉండి రైతులకు విత్తనాలు, ఎరువులు సమయానికి అందజేయాలని సూచించారు. నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పీడీ యాక్ట్ పెట్టాలని పేర్కొన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంపై దృష్టి: ఇందిరమ్మ ఇండ్లు ముఖ్యమని, క్షేత్రస్థాయిలో నిర్మాణ పనులు సమర్థవంతంగా సాగాలంటే కలెక్టర్ల పాత్ర కీలకమన్నారు. మేస్త్రీ చార్జీలు, క్రషర్ ధరలపై నియంత్రణ ఉండాలని సూచించారు. ఉచిత ఇసుక కూపన్ల సరఫరా సకాలంలో జరిగేలా చూడాలన్నారు.

భూభారతి చట్టంపై అవగాహన: భూభారతిని పేద రైతులకు చేరువ చేయాలన్నారు. భూభారతిపై అవగాహన సదస్సులు నిర్వహించి, ప్రజల్లో చట్టంపై అవగాహన కల్పించాలన్నారు.

రెవెన్యూ సదస్సులు, రాష్ట్ర దినోత్సవ ఏర్పాట్లు: జూన్ 3 నుంచి 20 వరకు మూడో దశ రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని సూచించారు. జూన్ 1 నాటికి నివేదిక అందించాలని, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని అన్ని జిల్లాల్లో ఘనంగా నిర్వహించాలని ఆదేశించారు. జూన్ 29, 30 తేదీల్లో జిల్లాల ఇంచార్జ్ మంత్రులు ఆయా జిల్లాల్లో పర్యటించాలని తెలిపారు.

సంగారెడ్డి జిల్లా హాజరు: ఈ సమావేశంలో సంగారెడ్డి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, సంబంధిత శాఖల అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!