మాజీ ఎమ్మెల్యే బానోత్ మదన్ లాల్ అకాల మరణం – బీఆర్ఎస్ నేతల నుండి తీవ్ర సంతాపం
భద్రాద్రి కొత్తగూడెం , ఆధాబ్ న్యూస్:
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గానికి చెందిన మాజీ శాసనసభ్యులు, భారత్ రాష్ట్ర సమితి సీనియర్ నాయకుడు బానోత్ మదన్ లాల్ అకాలంగా మృతి చెందాడు. ఈ వార్తతో పార్టీ శ్రేణులు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఈ సందర్భంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పందిస్తూ –
“మదన్ లాల్ మరణం తీవ్రంగా కలచివేసింది. ఇది పార్టీకి, ప్రజలకు తీరనిలోటు. సామాజిక న్యాయం, గిరిజన సంక్షేమం కోసం చేసిన సేవలు ఎనలేనివి. ప్రజల హితాన్ని కాపాడటంలో ఆయన చూపిన కట్టుబాటు చిరస్మరణీయంగా ఉంటుంది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను,” అని అన్నారు.
మదన్ లాల్ గిరిజన హక్కుల కోసం పోరాడిన నిజమైన ప్రజానాయకుడు. నియోజకవర్గ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేశాడు. ఆయన మృతి ఖమ్మం జిల్లా రాజకీయాల్లో ఓ శూన్యతను మిగిల్చింది.









