ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను పరిశీలించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు
ఆళ్లపల్లి, ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆళ్లపల్లి మండలం రాయపాడు గ్రామంలో ఇందిరమ్మ హౌసింగ్ స్కీమ్ పరిధిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు.
బేస్ మిట్ (ప్రారంభ దశ) పూర్తయ్యిన వెంటనే రూ. 1 లక్ష లబ్ధిదారుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. ఇళ్ల నిర్మాణ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. నిర్మాణంలో నాణ్యతకు ప్రాధాన్యం ఇవ్వాలని, యజమానులు దగ్గరుండి పనులను పరిశీలించాలని సూచించారు.
ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సహించబోమని, తప్పనిసరిగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ యువత కాంగ్రెస్ అధ్యక్షుడు తరుణ్ రెడ్డి, ఆళ్లపల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాయం రామ నర్సయ్య, మాజీ ప్రజా ప్రతినిధులు, మండల కాంగ్రెస్ నాయకులు శ్రీకాంత్, భరత్, యువజన నాయకులు వాసం శ్రీనాథ్, మహిళా నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.









