అభివృద్ధికి ఆమడ దూరంలో ఇప్పల గుంపు గ్రామం. మణుగూరు, ఆధాబ్ న్యూస్:
పల్లెలు దేశానికి పట్టుకొమ్మలు అన్న మహాత్మా గాంధీ మాటలకు ఇప్పుడు పాలకులు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, పల్లెలను నిర్లక్ష్యం చేయడం కొనసాగుతూనే ఉందని సామాజిక కార్యకర్త, న్యాయవాది కర్నె రవి ఆవేదన వ్యక్తం చేశారు. మండలంలోని పగిడేరు పంచాయతీ పరిధిలోని ఇప్పల గుంపు గ్రామం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉందని, కనీస మౌలిక వసతులు లేని పరిస్థితుల్లో గిరిజనులు జీవిస్తున్నారని తెలిపారు.
శనివారం ఒక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ, రహదారి, గూడు, నీడ లాంటి మౌలిక అవసరాలు లేకుండా గిరిజనులు జీవితం కొనసాగిస్తున్న పరిస్థితి విచారకరమని అన్నారు. గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా ఉండటంతో వర్షాకాలంలో రాకపోకలు అసాధ్యమవుతున్నాయని, అనారోగ్య సమస్యలు తలెత్తితే గిరిజన కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వివరించారు.
పాలకులు తమ ఇంటి ముందు బటబటలన్న రహదారులు వేయించుకోవడంలో చూపిన ఆసక్తిని గిరిజన గ్రామాలపై ఎందుకు చూపటం లేదని ప్రశ్నించారు. ఇప్పల గుంపుకు వెళ్లే మార్గం పూర్తిగా రాళ్లూ మట్టితో నిండిపోయి, నడవటానికి కూడా సౌలభ్యం లేకుండా మారిందని విమర్శించారు.
ప్రతి ఏటా ఆదివాసీ ప్రాంతాల అభివృద్ధికి కోట్లు ఖర్చు పెడుతున్నామంటూ ప్రభుత్వాలు లెక్కలు చూపుతున్నా, వాస్తవ పరిస్థితి దానికి భిన్నంగా ఉందని అన్నారు. రాబోయే వర్షాకాలం నేపథ్యంలో, స్థానిక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, జిల్లా కలెక్టర్, అటవీశాఖ అధికారులు చొరవ చూపి ఐటిడిఏ ద్వారా మంజూరైన గ్రావెల్ రహదారి నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని రవి డిమాండ్ చేశారు. అలాగే మండల పరిషత్ ఆధ్వర్యంలో తాత్కాలికం తూరులతో కాలువ పై రహదారి ఏర్పాటుచేయాలని కోరారు.









