అశ్వాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు. అశ్వాపురం , అధాబ్ న్యూస్
అశ్వాపురం మండలంలో పర్యటన సందర్భంగా పినపాక శాసనసభ్యులు గౌరవనీయులు పాయం వెంకటేశ్వర్లు అశ్వాపురం మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆయనకు హాస్పిటల్ సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్యశాలలోని రికార్డులను పరిశీలించి, ఔషధాల అందుబాటు పరిస్థితిని తెలుసుకున్నారు. అనంతరం పేషెంట్లతో మాట్లాడి వారి ఆరోగ్య పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. హాస్పిటల్ ప్రాంగణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు పిలుపునిచ్చారు.
ప్రజలకు మెరుగైన వైద్యం అందించాల్సిన అవసరం ఉందని, ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రసవాల సంఖ్యను పెంచాలని సూచించారు. ప్రతి గర్భిణీ స్త్రీ ఇంటి వద్దకే వెళ్లి వైద్య సలహాలు ఇవ్వాలని సూచించిన ఆయన, ప్రజలు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళకుండా ప్రభుత్వ ఆసుపత్రులను నమ్మేలా చర్యలు తీసుకోవాలన్నారు.
కుక్క కాటు, పాము కాటు, తేలు కాటుకు సంబంధించి అత్యవసర మందులు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండేలా చూడాలని, వేసవి తీవ్రత నేపథ్యంలో ప్రతి సెంటర్లో ORS ప్యాకెట్లు మరియు ఇతర అవసరమైన ఔషధాలను సిద్ధంగా ఉంచాలని హాస్పిటల్ సిబ్బందికి సూచించారు.
ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సిబ్బందితో పాటు, నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు తరుణ్ రెడ్డి, అశ్వాపురం మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బుర్కా అశోక్, ఉపాధ్యక్షులు గొల్లపల్లి నరేష్, మండల కాంగ్రెస్ నాయకులు, మహిళా నేతలు, యువజన నాయకులు మరియు పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.









