చిర్రకుంట చెరువు తూములు అలుగు – వృథాగా పోతున్న నీరు: టీడీపీ నేత చందా మధు ఆరోపణ . కరకగూడెం,ఆధాబ్ న్యూస్
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలంలోని చిరుమళ్ళ గ్రామపంచాయతీ పరిధిలో ఉన్న చిర్రకుంట చెరువు తూములు అలుగు మరమ్మతులు లేకపోవడంతో చెరువులో నిల్వ నీరు వృథాగా పోతుందని టీడీపీ పినపాక నియోజకవర్గానికి చెందిన నేత చందా మధు ఆరోపించారు.
తూముల వద్ద షట్టర్లు తుప్పు పట్టి పనిచేయకపోవడం వల్ల చెరువు రైతులకు ఎలాంటి ఉపయోగం కలిగించడం లేదని, పంటలకు అవసరమైన సమయంలో నీటి లభ్యత లేక పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చెరువు ఆధారంగా జీవించే రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని, వేసవి కాలంలో చెరువుల నిర్వహణపై అధికారులు తక్షణమే దృష్టి సారించాలని డిమాండ్ చేశారు.
గతంలో 2024 మే నెలలో కొంగల చెరువు తూములు మరమ్మతులు చేసుకోవడం జరిగిందని, దానికి 45 వేల రూపాయలు ఖర్చు చేసినా అధికారులు ఇప్పటివరకు బిల్లులు ఇవ్వలేదని ఆయన గుర్తు చేశారు.
ఇప్పటికైనా రాయినిపేట పరిధిలోని చిర్రకుంట చెరువును మరమ్మతులు చేయాలని చందా మధు కోరారు. ఈ కార్యక్రమంలో కొమరం ఎర్రయ్య, పగడాయ మల్లయ్య, రాములు, లక్ష్మీ నరసయ్య, రాంబాబు, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.









