ఏషియన్ ఉదయ భాస్కర్ థియేటర్‌లో అసౌకర్యాలు – ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన ప్రేక్షకులు
భద్రాచలం,ఆధాబ్ న్యూస్ :
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం
పట్టణంలోని ఏషియన్ ఉదయ భాస్కర్ సినిమా థియేటర్ నిర్వాహకుల తీరుపై స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసౌకర్యాల నడుమ థియేటర్ నిర్వహణ కొనసాగుతున్నదని, లోపాలపై స్పందించాల్సిన సిబ్బంది దురుసుగా ప్రవర్తించారంటూ ఆవేదన వ్యక్తమైంది. ఈ నేపథ్యంలో భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో అధికారికంగా ఫిర్యాదు చేయడం జరిగింది.
ఈ సందర్భంగా డొంకన చంద్రశేఖర్ మాట్లాడుతూ, “తాను కుటుంబ సభ్యులతో కలిసి ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసుకుని థియేటర్‌కు వెళ్లినప్పుడు తీవ్ర అసౌకర్యాలు ఎదురయ్యాయి. ఏసీ పనిచేయలేదు, సరైన ఫ్యాన్లు కూడా లేవు. మూత్రశాలలు, త్రాగేందుకు నీరు వంటి ప్రాథమిక సదుపాయాలు పూర్తిగా లేకపోవడంతో థియేటర్లో వాతావరణం ఉక్కపోతగా మారింది,” అని వివరించారు.
అంతేకాక, ప్రేక్షకులు చెల్లించిన డబ్బుకు తగిన సదుపాయాలు లేకపోవడాన్ని ప్రశ్నించగా, థియేటర్ సిబ్బంది దురుసుగా ప్రవర్తించారని, “ఎవరికి ఫిర్యాదు చేస్తే చేయండి” అన్నట్టుగా హేళనగా స్పందించారని వాపోయారు.
ఈ నేపథ్యంలో, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆర్డీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. “ప్రేక్షకులకు న్యాయం జరిగే వరకూ మా పోరాటం ఆగదు. అవసరమైన సదుపాయాలు అందించేంతవరకూ మా ఆందోళన కొనసాగుతుంది,” అని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో దామెర ఆదినారాయణ, ఎడారి రమేష్, పి. రామకృష్ణ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కోమటిరెడ్డి మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.









