సింగరేణి ఆసుపత్రుల్లో మందుల కొరత నివారణకు తక్షణ చర్యలు తీసుకోవాలి: సామాజిక సేవకులు కర్నే బాబురావు
కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
సింగరేణి వైద్యశాలల్లో మందుల కొరత నివారణకు ముందస్తు చర్యలు చేపట్టాలని, అలాగే చిల్డ్రన్ స్పెషలిస్ట్ డాక్టర్లను నియమించాలని మణుగూరుకు చెందిన సామాజిక సేవకులు కర్నే బాబురావు డిమాండ్ చేశారు.
ఈ మేరకు కొత్తగూడెం సింగరేణి ప్రధాన ఆసుపత్రిలో చీఫ్ మెడికల్ ఆఫీసర్ (సీఎంఓ) డా. రామాపోగు కిరణ్ రాజ్ కుమార్కు ఆయన వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన బాబురావు మాట్లాడుతూ, ప్రస్తుతం సింగరేణి ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా ఉందని, దీర్ఘకాలిక వ్యాధులకు అవసరమైన మందులు పూర్తిగా అందుబాటులో లేవని తెలిపారు.
“వైద్యులు నెల రోజుల మందులు రాస్తే, ఫార్మసీలో కేవలం పదిహేను రోజుల మందులు మాత్రమే ఇస్తున్నారు. దీనిని ప్రశ్నిస్తే మందుల కొరత ఉందనే సమాధానం వస్తోంది,” అని ఆయన అన్నారు. కొత్త డైరెక్టర్లు మరియు సీఎంఓ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మందుల కొనుగోళ్లపై నిర్ణయాల్లో జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు.
అలాగే, సింగరేణి ఆసుపత్రుల్లో చిల్డ్రన్ స్పెషలిస్ట్ల కొరత ఉందని, తాజా నియామకాల్లో వారికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎంఓను కోరినట్టు తెలిపారు. ఈ విజ్ఞప్తులపై డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్ సానుకూలంగా స్పందించారని, ప్రజాప్రతినిధులతో వినయంగా మాట్లాడే ఆయన ధోరణిపై హర్షం వ్యక్తం చేశారు.
నూతన సీఎంఓగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ కిరణ్ రాజ్ కుమార్కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన హయాంలో సింగరేణి ఉద్యోగులకు మెరుగైన వైద్యసేవలు అందుతాయన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు.









