ఇంకుడు గుంతలతోనే నీటి సంరక్షణ: ఎంపీడీఓ తేళ్ళూరి శ్రీనివాసరావు
మణుగూరు, ఆధాబ్ న్యూస్ : వర్షపు నీటి సంరక్షణకు, భూగర్భ జలాల పెంపుదలకు ఇంకుడు గుంతలు ఎంతగానో దోహదపడతాయని మండల అభివృద్ధి అధికారి (ఎంపీడీఓ) తేళ్ళూరి శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం మండల అభివృద్ధి కార్యాలయ ప్రాంగణంలో మూడు అడుగుల మేర ఇంకుడు గుంత తవ్వే కార్యక్రమాన్ని స్వయంగా గడ్డపార చేతబట్టి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణాల్లో తప్పనిసరిగా ఇంకుడు గుంతలు నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించిందని తెలిపారు. ముఖ్యంగా పల్లపు ప్రాంతాల్లో, బోర్లు, చేతి పంపుల సమీపాల్లో గుంతలు నిర్మిస్తే, భూగర్భ జలాల నింపుదల పెరిగి వేసవికాలంలో కూడా నీటి కొరత లేకుండా ఉంటుందని వివరించారు.
గుంతల పరిమాణం నేల స్వభావం, పరిసరాల పరిస్థితులు, నీటి లభ్యతను బట్టి నిర్ణయించుకోవాలన్నారు. ఎంపీడీఓతో పాటు కార్యాలయ సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.









