విజయలక్ష్మి ఆస్పత్రి వద్ద బంధువుల ఆందోళన, ఆసుపత్రిని సీజ్ చేసిన డీఎంహెచ్‌వో
ఇబ్రహీంపట్నం, ఆధాబ్ న్యూస్:
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని విజయలక్ష్మి ఆస్పత్రిలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. సిజేరియన్ సమయంలో కవల శిశువులు మృతి చెందడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ ఘటనకు కారణం డాక్టర్ నిర్లక్ష్యమేనని బంధువులు ఆరోపిస్తున్నారు. డాక్టర్ అనూషా రెడ్డి వీడియో కాల్ ద్వారా నర్సులతో చికిత్స చేయించారని, సమయానికి హాజరుకాలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వివరాల్లోకి వెళితే.. 20 రోజుల క్రితం గర్భిణి కీర్తి స్కానింగ్ కోసం హాస్పిటల్‌కు వెళ్లింది. కడుపులో కవలలు ఉన్నాయని, జాగ్రత్తగా ఉండాలని సూచించిన డాక్టర్, కొన్ని కుట్లు వేసి ఇంటికి పంపించారు. 5 నెలల గర్భంతో ఉన్న కీర్తికి ఆదివారం తెల్లవారుజామున నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు డాక్టర్ అనూషా రెడ్డిని సంప్రదించారు. ఇంజెక్షన్ వేయాలని సూచించినప్పటికీ నొప్పులు తగలకపోవడంతో ఆమెను విజయలక్ష్మి హాస్పిటల్‌కు తీసుకెళ్లారు.
అక్కడ డాక్టర్ ఫిజికల్‌గా హాజరుకాకుండా, వాట్సప్ వీడియో కాల్ ద్వారా నర్సులతో ట్రీట్మెంట్ చేయించిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఉదయం 10.30 గంటలైనా డాక్టర్ ఆస్పత్రికి రాలేదు. చివరికి ఇద్దరు శిశువులు మృతి చెందారు. ఉదయం 11 గంటలకు హాస్పిటల్‌కు వచ్చిన డాక్టర్ అనూషా రెడ్డి, కవలలు మృతి చెందారని, తల్లికి ప్రమాదం లేదని చెప్పింది.
సోమవారం ఉదయం కీర్తిని డిశ్చార్జ్ చేసే సమయంలో రూ.30,000 కట్టాలంటూ డిమాండ్ చేశారు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు ఘర్షణకు దిగారు. ఐవీఎఫ్ కోసం రూ.5 లక్షలు ఖర్చు పెట్టామని పేర్కొన్నారు. డాక్టర్ నిర్లక్ష్యమే శిశువుల మృతికి కారణమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఆస్పత్రికి చేరుకొని బాధితులను పరామర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్టు ఇబ్రహీంపట్నం సీఐ జగదీశ్ తెలిపారు. డీఎంహెచ్‌వో దాడి చేసి ఆసుపత్రిని తాత్కాలికంగా సీజ్ చేశారు.
ఈ ఘటనపై పూర్తి నివేదిక కోసం అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.









