వేసవిలో వడదెబ్బ ప్రమాదం: ప్రజలు అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్.
భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
ప్రముఖంగా పెరిగిపోతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఐడిఓసి కార్యాలయం ద్వారా విడుదలైన ఈ ప్రకటనలో, గత వారం రోజులుగా ఎండలు తీవ్రమవుతున్నాయని, ఉష్ణోగ్రతలు గణనీయంగా పెరుగుతున్నాయని పేర్కొన్నారు. వడదెబ్బ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రజలు అవసరమైతే తప్ప బయటకు రావద్దని సూచించారు.
ముఖ్యంగా మధ్యాహ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య ఇంట్లోనే ఉండాలని, ఈ సమయంలో శరీరంపై సూర్యరశ్మి పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. వడదెబ్బ తగిలిన వారు తక్షణమే సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించాలని లేదా 108 కు కాల్ చేసి సహాయం పొందాలని తెలిపారు.
వడదెబ్బ నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కలెక్టర్ వివరించారు. అందులో భాగంగా:
ఎండల్లో అనవసరంగా బయటకు వెళ్లకూడదు.
చిన్న పిల్లలు, వృద్ధులు ఇంటికే పరిమితం కావాలి.
ఎండలో నిలిపి ఉంచిన వాహనాల్లో పిల్లలు, పెంపుడు జంతువులను వదలకూడదు.
మధ్యాహ్న 2 నుండి 4 గంటల మధ్య వంట చేయకూడదు.
ఆల్కహాల్, టీ, కాఫీ, స్వీట్లు, చల్లని డ్రింక్స్ నివారించాలి.
చెప్పులు లేకుండా బయట నడవకూడదు.
విరివిగా ఉన్న దుస్తులు ధరించాలి.
బయటికి వెళ్లేటప్పుడు తప్పనిసరిగా గొడుగు లేదా టోపీ ఉపయోగించాలి.
ద్విచక్ర వాహనాలపై సుదూర ప్రయాణాలు చేయరాదు.
ఎండలో పనిచేసే కార్మికులు తరచుగా నీరు, ఓ.ఆర్.ఎస్. ద్రావణం తీసుకోవాలని సూచించారు. వడదెబ్బ లక్షణాలైన చర్మంపై ఎర్రటి దద్దుర్లు, పొడి చర్మం, అధిక జ్వరము, అలసట, వాంతులు, తలనొప్పి, నోరు ఎండిపోవడం వంటి లక్షణాలు ఉన్నప్పుడు వెంటనే వైద్య సాయం పొందాలని సూచించారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అవసరమైన మందులు, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉన్నాయని తెలిపారు.
ఈ సందర్భంగా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, ప్రజలంతా తగు జాగ్రత్తలు తీసుకుని వేసవి కాలంలో తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశారు.









