రాజుపేట, విట్టల్ రావు నగర్ రైతుల పినపాక ఎమ్మెల్యేకు వినతి పత్రం అందజేత.
మణుగూరు,ఆధాబ్ న్యూస్: పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లును బుధవారం నాడు మణుగూరు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసిన రాజుపేట, విట్టల్ రావు నగర్, పీకే వన్ సెంటర్ గ్రామస్తులు, రైతులు తమ ప్రాంత సమస్యలను వివరించారు. ఈ సందర్భంగా
వారు మాట్లాడుతూ మణుగూరు మండలం రాజుపేట, విట్టల్ రావు నగర్, పీకే వన్, బాపనగుంట గ్రామాలు సింగరేణి ఎఫెక్ట్ ఏరియాలోకి వస్తున్నాయని, ఈ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రతిరోజూ జరుగుతున్న సింగరేణి బ్లాస్టింగ్ వల్ల ఇళ్లకు తీవ్రంగా నష్టం వాటిల్లుతోందని, గోడలు పగలుతున్నాయని, ఇండ్లపై పడుతున్న ధూళి వల్ల మంచినీరు కూడా కలుషితమవుతుందని వాపోయారు.
వీరు ఆవేదన వ్యక్తం చేస్తూ, కేవలం 50 మీటర్ల దూరంలోనే బ్లాస్టింగ్ జరుగుతోందని, ఇలా దగ్గరగా బ్లాస్టింగ్ జరగడం వల్ల తమ జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని చెప్పారు. 1-2 కిలోమీటర్ల దూరంలో బ్లాస్టింగ్ జరిగినా ఇండ్లు ఊగిపోతున్నాయని, తమ గ్రామాల్లో మాత్రం 50 మీటర్లకే బ్లాస్టింగ్ జరగడాన్ని వారు తీవ్రంగా విమర్శించారు.
ఈ మేరకు, సంబంధిత కలెక్టర్, అధికారులు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తమ గోడు తీసుకెళ్లి పరిహారం కల్పించాలని, సురక్షిత ప్రాంతాలకు తాము తరలించాలని కోరుతూ సంతకాలతో కూడిన వినతిపత్రాన్ని ఎమ్మెల్యేకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ మణుగూరు పట్టణ కార్యదర్శి దుగ్గ్యాల సుధాకర్, ఏఐటీయూసీ మణుగూరు మండల కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, గ్రామస్తులైన ఐయితన బోయిన వెంకన్న, బొజ్జ సదానందం, శ్రీకాకుళం వీరమల్లు, రాజయ్య, రాములు తదితరులు పాల్గొన్నారు.









