పంచాయతీకి తాళం వేసిన గ్రామస్తులు: కిష్టాపురం ఇందిరమ్మ ఇళ్ల పంపిణీలో అవకతవకల ఆరోపణలు
ఖమ్మం,ఆధాబ్ న్యూస్ :
వనం వారి కిష్టాపురం గ్రామంలో ఇళ్ల కేటాయింపుపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకం ఎంపిక ప్రక్రియలో తీవ్ర అసంతృప్తి చోటు చేసుకుంది.
గ్రామానికి ఎంపిక చేసిన ఇందిరమ్మ కమిటీలో ముగ్గురు సభ్యులు మిగతా సభ్యులకు తెలియకుండా సొంత నిర్ణయాలతో లబ్దిదారుల ఎంపిక చేశారని స్థానికులు ఆరోపిస్తున్నారు. పొలాలు ఉన్నవారికి, ప్రభుత్వ ఉద్యోగాలు కలిగినవారికే ఇళ్లు కేటాయించారని, వాస్తవంగా గుడిసెలో నివసించే పేదలకు మాత్రం ఈ పథకం లబ్ధి చేకూరలేదని వారు వాపోతున్నారు.
ఈ వ్యవహారంపై ఆగ్రహంతో గ్రామస్థులు పంచాయతీ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపారు. పథకంలో పారదర్శకత లేకుండా జరుగుతున్న అన్యాయాలను వెంటనే సరిచేయాలని, పునఃసమీక్ష చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటివి జరుగకుండా చూడాలంటే అధికారులు తక్షణం స్పందించాలని గ్రామస్థులు కోరుతున్నారు.









