రోడ్డు ప్రమాదంలో కాంగ్రెస్ నేత గోరంట్ల శ్రీను మృతి
పినపాక, ఆధాబ్ న్యూస్:
పినపాక మండలం గోపాలరావుపేట గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు గోరంట్ల శ్రీను రోడ్డుప్రమాదంలో మృతి చెందారు. వేములవాడకు మొక్కు చెల్లింపుకు బయలుదేరిన సమయంలో సోమవారం తెల్లవారుఝామున తాడ్వాయి అడవిలో ప్రమాదం చోటుచేసుకుంది. రంగాపురం వైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని బొలెరో వాహనం శ్రీను ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది.
తలకు తీవ్ర గాయం కావడంతో శ్రీను అక్కడికక్కడే మృతి చెందగా, బొలెరో వాహనం ఘటన అనంతరం పరారైంది. ఈ ప్రమాదంలో మరికొందరు స్వల్పంగా గాయపడ్డారు.
శ్రీను, పినపాక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లకు అత్యంత సన్నిహితుడిగా రాజకీయంగా చురుకుగా పాల్గొనేవారు. నాలుగు రోజుల క్రితం కుమారుడి వివాహం జరిపించిన శ్రీను, పచ్చతోరణం ఎండకముందే అకాల మరణం చెందడం గ్రామంలో తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
గతంలో శ్రీనుకు భార్యను కూడా అనారోగ్యంతో కోల్పోయిన నేపథ్యంలో, ఇద్దరు కుమారులు తల్లిదండ్రుల మద్దతు లేకుండా ఒంటరైపోయారు. ఈ ఘటన గ్రామంలో విషాద ఛాయలు విస్తరించింది.









