భద్రాద్రి కొత్తగూడెం, ఆధాబ్ న్యూస్:
జిల్లాలోని కోర్టు డ్యూటీ అధికారులతో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశం జిల్లా ఎస్పీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాల్ లో జరిగింది.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, పెండింగ్ కేసుల త్వరితగతిన పరిష్కారానికి న్యాయాధికారులతో సమన్వయం పాటిస్తూ, ప్రతి అధికారుడు బాధ్యతతో విధులు నిర్వహించాలని సూచించారు. జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్లలో పెండింగ్లో ఉన్న కేసుల వివరాలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు.
కేసులు పెండింగ్లో ఉండడానికి గల కారణాలను విశ్లేషించి, కేసుల పురోగతిని ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు నివేదిస్తూ, ఆన్లైన్లో వివరాలు నమోదు చేయాలని కోర్టు డ్యూటీ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవని హెచ్చరించారు.
ఇక NBW (నాన్-బెయిలబుల్ వారెంట్లు) జారీ విషయంలో అలసత్వం ప్రదర్శించకూడదని స్పష్టం చేశారు. నేరస్థులకు శిక్ష విధించేలా కృషి చేసి కన్విక్షన్ రేటును పెంచే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. కేసులపై ఏవైనా సందేహాలు ఉంటే ఉన్నతాధికారుల సలహా తీసుకుని తగిన చర్యలు తీసుకోవాలని తెలిపారు.
ఈ సమావేశంలో డిసిఆర్బి ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ నాగరాజు రెడ్డి, ఎస్సైలు హారిక, హసీనా, ఇతర అధికారులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.









