ఆధాబ్ న్యూస్ /కరకగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండల పరిధిలోని చొప్పాల గ్రామంలో చిన్నగుట్ట మీద వెలసిన ఆదివాసీల ఆరాధ్య దైవం ఆదిపరాశక్తి సారలమ్మ తల్లి నిండు జాతర సందర్భంగా భక్తుల కోలాహలంతో గ్రామం మార్మోగింది. సారలమ్మ తల్లి యొక్క వార్షిక ఉత్సవాన్ని పురస్కరించుకుని గురువారం జాతర అత్యంత వైభవంగా నిర్వహించారు.తల్లి వనం నుండి జనంలోకి మేళాలతో, బ్యాండ్ సప్పులతో తల్లి ఉత్సవ విగ్రహాన్ని తీసుకురావడం జరిగింది. ఈ కార్యక్రమంలో డిల్లీ సరొజిని దేవరబాల ఆర్తి బిడ్డలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తల్లి రాకను స్వాగతించడానికి గ్రామ యువత, మహిళలు ముందుండి స్వాగతించారు.భక్తులు తల్లి సారలమ్మను వారి కోరికలు తీర్చమని వేడుకున్నారు. కొంతమంది కొలువులు తీర్చుకున్న ఆనందంలో తల్లికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చి తల్లి దర్శనం చేసుకున్నారు.జాతర సందర్భాన్ని పురస్కరించుకుని గ్రామంలో పలు సాంస్కృతిక కార్యక్రమాలు, క్రీడా పోటీలు నిర్వహించగా, ఆదివాసీ సంప్రదాయ గీతాలు, నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ సమీపంలో ఏర్పాటు చేసిన బజార్లు భక్తులతో కిటకిటలాడాయి.ఈ పండుగను పురస్కరించుకుని గ్రామస్థులు తల్లి సేవలో నిమగ్నమై భక్తులకు అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. సారలమ్మ తల్లి జాతరను సందర్శించిన ప్రతి ఒక్క భక్తుడు ఈ అనుభూతిని జీవితాంతం గుర్తుంచుకుంటానని పేర్కొన్నాడు.









