ముక్కోటి ఉత్సవాలకు జిల్లా కలెక్టర్ కు ఈవో ఆహ్వానం .
ఆధాబ్ న్యూస్ ,భద్రాచలం :
జనవరి 9,10 తేదీల్లో జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్సవాలకు ప్రత్యేక అతిధిగా హాజరుకావాలని భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం ఈవో రమాదేవి ఆదివారం జిల్లా కలెక్టర్ జితేష్ వి.పాటిల్ ను ఐడీఓసీ కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలిసి ఆహ్వాన పత్రిక అందించారు. ఈ సందర్భంగా శ్రీ సీతారామచంద్ర స్వామి ఆలయ అర్చకులు జిల్లా కలెక్టర్ కు ఆహ్వాన పత్రిక అందించి ఆశీర్వచనాలు అందించారు. అనంతరం జిల్లా కలెక్టర్ భద్రాచలం ఆలయ ఈవోను ముక్కోటి ఉత్సవాల సందర్భంగా చేస్తున్న ఏర్పాట్లను అడిగి తెలుసుకున్నారు. ముక్కోటి ఏకాదశి సందర్భంగా భద్రాచలం వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు కల్పించాలని సూచించారు. భక్తులకు తాగునీరు, వసతి, వైద్య, భద్రత సదుపాయాలు వంటివి అందుబాటులో ఉంచాలని చెప్పారు. ముక్కోటి వేడుకల ఏర్పాట్లు భక్తులు మెచ్చేలా ఉండాలన్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రచారం నిర్వహించాలని సూచించారు .









