ప్రతి క్షణం
ప్రజల పక్షం

  రేగా కాంతారావు వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేత

రేగా కాంతారావు వ్యాఖ్యలను ఖండించిన కాంగ్రెస్ నేత

కరకగూడెం, ఆగస్టు 25 (ఆధాబ్ న్యూస్): మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై చేసిన వ్యాఖ్యలను కరకగూడెం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ఇక్బాల్ హుస్సేన్ తీవ్రంగా ఖండించారు. మంగళవారం కరకగూడెం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆదేశాల మేరకు మండల ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇక్బాల్ హుస్సేన్ మాట్లాడుతూ.. రేగా కాంతారావు ముందుగా తనపై వచ్చిన ఆరోపణలకు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆరోపణలు వచ్చిన తర్వాత కొంతకాలంగా ప్రజలకు దూరంగా ఉన్న ఆయన ఇప్పుడు ర్యాలీలు నిర్వహిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం రాజకీయ దిగజారుడుతనానికి నిదర్శనమని విమర్శించారు. సీఎం నాయకత్వంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలు గమనిస్తున్నారని తెలిపారు. పినపాక నియోజకవర్గంలో ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలు చూస్తున్నారని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన రేగా కాంతారావు అనంతరం కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరిన విషయాన్ని ప్రజలు మర్చిపోలేదని ఇక్బాల్ హుస్సేన్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ, సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేపై విమర్శలు చేసే ముందు తన రాజకీయ గతాన్ని గుర్తు చేసుకోవాలని సూచించారు.

తప్పుడు కేసులు పెట్టించేంత తప్పుడు మనుషులు కాంగ్రెస్ నాయకులు కాదని, తమ నాయకులపై నిరాధార ఆరోపణలు చేస్తే రాజకీయంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో గట్టిగా సమాధానం చెబుతామని హెచ్చరించారు. రాజకీయ విమర్శలకు తాము భయపడబోమని, అయితే వ్యక్తిగతంగా అసత్య ఆరోపణలు చేయడం సహించబోమని స్పష్టం చేశారు.

“రాష్ట్ర ప్రజలు అభివృద్ధిని చూస్తున్నారు.. మాటల రాజకీయాలను కాదు. ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నారో ప్రజలకు స్పష్టంగా తెలుసు. ర్యాలీలు, వ్యక్తిగత విమర్శలతో ప్రజల తీర్పును మార్చలేరు” అని ఇక్బాల్ హుస్సేన్ అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు, మండల ముఖ్య నాయకులు, సర్పంచులు, ఉపసర్పంచులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు, బూత్‌, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యకర్తలు, మాజీ ప్రజాప్రతినిధులు, మహిళలు, యువకులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

సారలమ్మ గుడికి రోడ్డు, విద్యుత్, నీటి సౌకర్యాలు కల్పించాలి* సారలమ్మ గుడికి రోడ్డు సౌకర్యం ఏదీ..? భక్తులకు తప్పని అవస్థలు… 20 ఏళ్లుగా ఇదే దుస్థితి.. సారలమ్మ గుడికి కనీస వసతులు కరువు.. రోడ్డు, నీరు, కరెంట్ లేక ఇబ్బందులు.. సారలమ్మ భక్తుల ఆవేదన.. గుడికి వెళ్లాలంటే అయోమయం.. తక్షణమే రోడ్డు వేయాలని డిమాండ్.. సారలమ్మ ఆలయానికి మౌలిక వసతులు కల్పించాలి: జేఏసీ అధ్యక్షుడు గోగ్గల కృష్ణ….