నేతకానిల అస్తిత్వాన్ని కాపాడాలి: మంత్రి శ్రీధర్ బాబుకు సమత సైనిక్ దళ్ వినతి
హైదరాబాద్, ఏప్రిల్ 22 (ఆధాబ్ న్యూస్):
నేతకాని కులస్తుల చారిత్రక అస్తిత్వాన్ని కాపాడాలని, ఎస్సీ వర్గీకరణలో గ్రూప్-ఏ కింద 3 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని కోరుతూ సమత సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబుకు వినతిపత్రం సమర్పించింది.
బుధవారం హైదరాబాద్‌లో మంత్రిని కలిసిన సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ మార్షల్ దుర్గం నగేష్ పలు కీలక డిమాండ్లను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వ రికార్డుల్లో నేతకాని కులాన్ని ‘మాలసాలె’ లేదా ‘నెట్కాని’గా తప్పుగా నమోదు చేయడం వల్ల తమ సామాజిక గుర్తింపు దెబ్బతింటోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నేతకాని ఒక స్వతంత్ర సామాజిక వర్గమని, గెజిట్‌లో ఉన్న తప్పుడు పేర్లను తొలగించి ‘నేతకాని’గా మాత్రమే నమోదు చేయాలని కోరారు.
రాష్ట్రంలో సుమారు 15 లక్షలకు పైగా జనాభా ఉన్న నేతకానిలు విద్యా, ఆర్థిక రంగాల్లో వెనుకబడి ఉన్నారని, ప్రస్తుత వర్గీకరణ వల్ల తగిన న్యాయం జరగడం లేదని తెలిపారు. తమను గ్రూప్-ఏలో చేర్చి 3 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేశారు. అలాగే కుల గణనలో జనాభా లెక్కలను శాస్త్రీయంగా ధృవీకరించాలని విజ్ఞప్తి చేశారు.
వినతిపై స్పందించిన మంత్రి శ్రీధర్ బాబు, నేతకాని సామాజిక వర్గ సమస్యలను క్యాబినెట్ స్థాయిలో చర్చించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. కుల ధ్రువీకరణ పత్రాల జారీ ప్రక్రియలో ఉన్న గందరగోళాన్ని తొలగించేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ముడీమడుగుల సురేష్ తదితరులు పాల్గొన్నారు.








