Arrive Alive-2026 కార్యక్రమాలు విజయవంతం చేయాలి: జిల్లా ఎస్పీ రోహిత్ రాజు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
రోడ్డు ప్రమాదాలను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్ పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న Arrive Alive-2026 కార్యక్రమం ద్వారా వాహనదారులకు రోడ్డు భద్రతపై అవగాహన కల్పించడంతో పాటు, ఇతర శాఖల సమన్వయంతో ప్రమాదాల నివారణ చర్యలు చేపడుతున్నామని తెలిపారు.
ఈ నెల 13వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఆరు రోజుల పాటు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్న కార్యక్రమాలకు ప్రజలు, యువత, వాహనదారులు భాగస్వాములు కావాలని ఆయన కోరారు. స్వీయ నిర్లక్ష్యం, ట్రాఫిక్ నియమాల ఉల్లంఘన వల్ల ప్రతి సంవత్సరం అనేక మంది ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
హెల్మెట్ వినియోగం, సీటుబెల్ట్ ధరించడం, డిఫెన్సివ్ డ్రైవింగ్ వంటి నియమాలను తప్పనిసరిగా పాటిస్తే ప్రమాదాలను తగ్గించవచ్చని పేర్కొన్నారు. ట్రాఫిక్ పోలీసులు ఉన్నా లేకపోయినా రోడ్డు నియమాలను పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంపింగ్, ఓవర్ లోడింగ్ వంటి ఉల్లంఘనలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహిస్తామని హెచ్చరించారు.
కార్యక్రమాల వివరాలు:
13వ తేదీ (సోమవారం): గ్రామాల్లో కమిటీల ఏర్పాటు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు
14వ తేదీ (మంగళవారం): అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రతిజ్ఞలు, బ్లాక్ స్పాట్స్ గుర్తింపు & మరమ్మత్తులు
15వ తేదీ (బుధవారం): పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అవగాహన, బస్సు డ్రైవర్లకు సదస్సులు
16వ తేదీ (గురువారం): ఆటో డ్రైవర్లకు అవగాహన, లైసెన్స్ & యూనిఫామ్ తనిఖీలు
17వ తేదీ (శుక్రవారం): ప్రమాద స్థలాల్లో ప్రధమ చికిత్సపై శిక్షణ కార్యక్రమాలు
18వ తేదీ (శనివారం): ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారికి జరిమానాలు, అవగాహన కార్యక్రమాలు
జిల్లా వ్యాప్తంగా చేపట్టనున్న ఈ కార్యక్రమాలకు ప్రజలు పూర్తిస్థాయిలో సహకరించాలని ఎస్పీ రోహిత్ రాజు విజ్ఞప్తి చేశారు.








