భద్రాద్రి కొత్తగూడెం ప్రతినిధి, ఆధాబ్ న్యూస్:
ఆపదలో ఉన్నవారికి అండగా నిలబడటం ప్రతి ఒక్కరికీ సాధ్యం కాదు. కానీ “మనం ఉన్నాం” అనే నమ్మకం కలిగిస్తూ ముందుకు వచ్చే వారు సమాజానికి నిజమైన ఆదర్శంగా నిలుస్తారు. అలాంటి వ్యక్తిత్వానికి నిలువెత్తు ఉదాహరణగా నిలిచారు ఏడుళ్ల బయ్యారం రేంజర్ తేజస్వి.
విధి నిర్వహణలో కట్టుదిట్టమైన క్రమశిక్షణతో పాటు, సేవా కార్యక్రమాల్లోనూ తనదైన ముద్ర వేసుకుంటూ ప్రజల మన్ననలు పొందుతున్న ఆమె, తాజాగా మరోసారి తన మంచితనాన్ని చాటుకున్నారు. కష్టాల్లో ఉన్న ఒక నిరుపేద కుటుంబం పరిస్థితిని తెలుసుకున్న వెంటనే స్పందించి, తన వంతుగా రూ.2000 ఆర్థిక సహాయం అందించారు.
ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న ఆ కుటుంబానికి ఆమె చేసిన ఈ చిన్న సహాయం పెద్ద ఊరటనిచ్చింది. “ఆపదలో ఉన్నప్పుడు తోడు నిలిచిన తేజస్వి మేడం మా కుటుంబానికి దేవుడిలాంటి వారు” అంటూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం విధులు నిర్వహించడం మాత్రమే కాదు, సమాజానికి సేవ చేయాలనే భావన కూడా ఉండాలని తేజస్వి మరోసారి నిరూపించారు. ఇటువంటి మంచి మనసున్న అధికారులు ఉండటం ప్రజలకు నిజంగా ఆశాజనక విషయం.









