గజ్వేల్ క్యాంపు కార్యాలయంపై దాడి ప్రజాస్వామ్యంపై దాడి బీఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి.
పినపాక, ఆధాబ్ న్యూస్:
గజ్వేల్లోని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ క్యాంపు కార్యాలయంపై జరిగిన దాడి ప్రజాస్వామ్యంపై జరిగిన దాడిగా బీఆర్ఎస్ పార్టీ పినపాక మండల అధ్యక్షులు పగడాల సతీష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.
మండలంలోని ఏడూళ్లబయ్యారం క్రాస్రోడ్లో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి చెందిన గుండాలు క్యాంపు కార్యాలయంలోకి చొరబడి ఆస్తులను ధ్వంసం చేయడంతో పాటు గోడలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫోటోను బలవంతంగా ఏర్పాటు చేయడం దుర్మార్గ చర్యగా అభివర్ణించారు.
ఈ ఘటన సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతోనే జరిగిందని ఆరోపిస్తూ, అధికార మదంతో కాంగ్రెస్ నాయకులు నియంత్రణ కోల్పోయి వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రజాప్రతినిధుల క్యాంపు కార్యాలయాలపై దాడులు జరుగుతుంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు ఉన్నాయా అనే సందేహం వ్యక్తం చేశారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాలు, మీడియాపై దాడులు పెరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి ముప్పు అని అన్నారు. శాంతిభద్రతలను కాపాడాల్సిన పోలీస్ యంత్రాంగం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు.
హేట్ స్పీచ్ బిల్లుతో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ మరోవైపు దాడులకు పాల్పడటం ప్రజాస్వామ్య విరుద్ధమని, ఇందిరమ్మ రాజ్యం పేరుతో గూండారాజ్యం నడుస్తోందని విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఎలాంటి అణచివేతలకు భయపడదని, ప్రజల తరపున పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి చేసిన వారిని గుర్తించి వెంటనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు.









