భూభారతి పెండింగ్ దరఖాస్తులు త్వరితగతిన పరిష్కరించాలి
అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు: జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 2 (ఆధాబ్ న్యూస్):
జిల్లాలో భూసంబంధిత సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇవ్వాలని, భూభారతి కింద పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులన్నింటినీ త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ అంకిత్ అధికారులను ఆదేశించారు. గురువారం ఐడీఓసీ కార్యాలయంలో అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్‌తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూభారతి పెండింగ్ దరఖాస్తులపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని సూచించారు. ప్రజావాణి కార్యక్రమంలో సుదూర ప్రాంతాల నుంచి భూ సమస్యలపై అధిక సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నాయని, వాటి పరిష్కారానికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. శాఖల మధ్య సమన్వయం పెంచి ప్రతి సమస్యను ప్రాధాన్యంగా పరిష్కరించాలని ఆదేశించారు.
ఎస్‌ఐఆర్ మ్యాపింగ్ ప్రక్రియను బీఎల్ఓల వారీగా, మండలాల వారీగా విభజించి సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని, ప్రతి బీఎల్ఓకు లక్ష్యాలను నిర్దేశించి సమయానికి పూర్తి చేయించేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. జనగణనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తిచేసి, తహసీల్దారుల ఐడీ క్రియేషన్‌ను వేగవంతం చేయాలని, పర్యవేక్షణకు ప్రత్యేక అధికారిని నియమించాలని సూచించారు.
జిల్లాలో అక్రమ ఇసుక రవాణాపై వస్తున్న ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకుని ఇసుక రీచ్‌ల నిర్వహణపై తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో అక్రమంగా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇసుక రీచ్‌లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానని, ఇప్పటి వరకు నమోదు చేసిన కేసుల వివరాలను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
జిల్లాలో అభివృద్ధి పనులకు సంబంధించి భూసేకరణ పురోగతి, పెండింగ్ కోర్టు కేసులపై కూడా సమగ్ర సమాచారం కోరారు. వచ్చే వారంలో జిల్లాలోని తహసీల్దారులతో భూభారతి, ప్రజావాణి దరఖాస్తులు, ఎస్‌ఐఆర్ మ్యాపింగ్, జనగణన, భూసేకరణ అంశాలపై సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహిస్తానని తెలిపారు.
ఈ సమావేశంలో సిపిఓ సంజీవరావు, ఎన్నికల సూపరింటెండెంట్ రంగ ప్రసాద్, ఈ సెక్షన్ సూపరింటెండెంట్ స్వర్ణలత, ఏడి మైన్స్ దినేష్, భూసేకరణ అధికారి యాసిన్ తదితరులు పాల్గొన్నారు.









