శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మకు ఘన వీడ్కోలు
భద్రాద్రి కొత్తగూడెం, ఏప్రిల్ 2 (ఆధాబ్ న్యూస్):
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సంవత్సరం పాటు శిక్షణ కలెక్టర్‌గా విధులు నిర్వహించిన సౌరబ్ శర్మ శిక్షణ పూర్తి చేసుకుని వెళ్లనున్న సందర్భంగా గురువారం ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్, ఐటిడిఏ పీవో రాహుల్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ, శిక్షణ కాలంలో సౌరబ్ శర్మ చూపిన నిబద్ధత, కృషి ప్రశంసనీయమని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో ఆయన చురుకుదనం కనబరిచారని పేర్కొన్నారు. తాను కరీంనగర్ జిల్లా కలెక్టర్‌గా శిక్షణ పొందిన సమయంలో పొందిన అనుభవాలను పంచుకుంటూ, అటెండర్ నుండి కూడా మర్యాద, గౌరవం వంటి విలువలు నేర్చుకున్నానని తెలిపారు.
దివ్యాంగుల విద్యార్థుల కోసం పాఠశాల నిర్మాణానికి సౌరబ్ శర్మ రూపొందించిన ప్రత్యేక డిజైన్ రాష్ట్ర స్థాయిలో గుర్తింపు పొందిందని, ఆయన సృజనాత్మకతను అభినందించారు.
ఐటిడిఏ పీవో రాహుల్ మాట్లాడుతూ, వైవిధ్యమైన జిల్లాలో శిక్షణ పొందిన సౌరబ్ శర్మ విలువైన అనుభవాన్ని సంతరించుకున్నారని తెలిపారు. శిక్షణ అనంతరం ఢిల్లీ నీతి ఆయోగ్‌లో ఆరు నెలల శిక్షణకు వెళ్లనున్నారని చెప్పారు. జిల్లాలో సికిల్ సెల్ అనీమియా సమస్యపై ప్రత్యేక దృష్టి సారించి, గిరిజన ప్రాంతాల్లో పిల్లలకు పరీక్షలు నిర్వహించడంలో ఆయన చొరవ చూపారని వివరించారు. ఈ వ్యాధిపై ప్రత్యేక ప్రాజెక్ట్ రూపొందించి సమర్పించినట్లు తెలిపారు.
శిక్షణ కలెక్టర్ సౌరబ్ శర్మ మాట్లాడుతూ, జిల్లాలో శిక్షణ పూర్తి చేసుకోవడం ఆనందంగా ఉందన్నారు. జిల్లా కలెక్టర్ అంకిత్, మాజీ కలెక్టర్ జితేష్ వి పాటిల్ మార్గదర్శకత్వం, అధికారుల సహకారంతో శిక్షణ విజయవంతంగా పూర్తయిందని తెలిపారు. తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలను తెలుసుకునే అవకాశం లభించిందని అన్నారు.
సౌరబ్ శర్మ కష్టపడి పనిచేసే అధికారి అని, బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ వినయంతో వ్యవహరిస్తారని అధికారులు కొనియాడారు. భవిష్యత్‌లో ఉన్నత స్థానాలను అధిరోహించాలని ఆకాంక్షించారు.
అనంతరం సౌరబ్ శర్మను శాలువా, జ్ఞాపికలతో సత్కరించారు.
ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, జడ్పీ సీఈవో నాగలక్ష్మి, ఆర్డీవో మధు, సిపిఓ సంజీవరావు, ఏవో అనంత రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.









