ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నవమికి ముందే రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభం

నవమికి ముందే రామతీర్థం గిరి ప్రదక్షిణ మార్గం ప్రారంభం
ఏపీ ,ఆధాబ్ న్యూస్:
విజయనగరం జిల్లా, నెలిమర్ల నియోజకవర్గంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో గిరి ప్రదక్షిణ మార్గాన్ని బుధవారం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వర్చువల్‌గా ప్రారంభించారు. శ్రీరామ నవమికి ముందు భక్తులకు ఈ సౌకర్యం అందుబాటులోకి రావడం విశేషం.

సీతారాముని పేట కూడలి నుంచి నీలాచలం కొండ వరకు సుమారు 3.70 కిలోమీటర్ల మేర రూ. 3.40 కోట్ల ఉపాధి హామీ (ఎన్ఆర్ఈజీఎస్) నిధులతో ఈ బీటీ రహదారిని నిర్మించారు. గతంలో రాళ్లు, ముళ్లతో నిండిన ఈ మార్గంలో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, ఇప్పుడు సౌకర్యవంతమైన రహదారి అందుబాటులోకి వచ్చింది.

ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఆలయాల అభివృద్ధి, హిందూ ధర్మ పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి పనిచేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గత 20 నెలల్లో రూ. 40 కోట్లకు పైగా వ్యయం చేసి 22 ప్రధాన ఆలయాలకు రోడ్డు సౌకర్యం కల్పించామని తెలిపారు. ఇప్పటికే శ్రీకాళహస్తి గిరి ప్రదక్షిణ మార్గాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకువచ్చామని, కోటప్పకొండ గిరి ప్రదక్షిణ మార్గానికి రోడ్డు మంజూరు చేశామని పేర్కొన్నారు.

రామతీర్థం పుణ్యక్షేత్రానికి రామాయణ, మహాభారత కాలం నాటి ప్రాధాన్యం ఉందని, గిరి ప్రదక్షిణ చేయడం ద్వారా భక్తులకు ముక్తి లభిస్తుందనే విశ్వాసం ఉందని పవన్ కళ్యాణ్ తెలిపారు. గత ప్రభుత్వంలో రాములవారి విగ్రహానికి జరిగిన అవమాన ఘటన భక్తులను కలచివేసిందని, ఇప్పుడు ఆలయ అభివృద్ధితో ఆ వేదన కొంత మేర తీరిందన్నారు.

ఈ కార్యక్రమంలో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్, ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు, ఎమ్మెల్యేలు లోకం మాధవి, పూసపాటి అదితి విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

రిటర్న్ సీడ్ పేరుతో రైతులకు టోకరా.. నట్టేట మునిగిపోతున్న అన్నదాతలు సీడ్ కంపెనీల మోసాలపై జేఏసీ అధ్యక్షుడు గొగ్గల కృష్ణ ఆగ్రహం గ్రామాల్లో తనిఖీలు నిర్వహించి నాసిరకం విత్తనాలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్