పదవ తరగతి పరీక్షా కేంద్రాలపై కలెక్టర్ అంకిత్ ఆకస్మిక తనిఖీలు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
కొత్తగూడెం పట్టణంలో సోమవారం జిల్లా కలెక్టర్ అంకిత్ పదవ తరగతి వార్షిక పరీక్షలు నిర్వహిస్తున్న పలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా సింగరేణి కాలరీస్ హై స్కూల్, సెయింట్ మేరీస్ హై స్కూల్, బాబు క్యాంపు పీఎం శ్రీ ఉన్నత పాఠశాలల్లో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలను సందర్శించి పరీక్షల నిర్వహణ తీరును సమగ్రంగా పరిశీలించారు.
పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా సజావుగా జరుగుతున్నాయా అనే అంశంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. విద్యార్థులకు కల్పిస్తున్న సౌకర్యాలపై ఆరా తీసి త్రాగునీరు, విద్యుత్, కూర్చునే ఏర్పాట్లు, గదుల పరిశుభ్రత, ప్రశాంత వాతావరణం వంటి అంశాలను పరిశీలించారు. అవసరమైన చోట్ల తక్షణ మెరుగులు చేర్చాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
విద్యార్థులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయగల వాతావరణాన్ని కల్పించాలన్నారు. పరీక్షల నిర్వహణలో నిబంధనలు కచ్చితంగా పాటించాలని, ఎలాంటి అక్రమాలు, మాల్‌ప్రాక్టీస్‌కు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఇన్విజిలేటర్లు, సిబ్బంది తమ బాధ్యతలను సమర్థంగా నిర్వహించాలని సూచించారు.
పరీక్షా కేంద్రాల పరిసరాల్లో సెక్షన్ 163 (బి) అమలు, భద్రతా చర్యలు, పోలీసు బందోబస్తు వంటి అంశాలపై కూడా సమీక్షించారు. కేంద్రాల వద్ద అనవసరంగా గుంపులు గుమికూడకుండా చర్యలు తీసుకోవాలని, బయటి వ్యక్తుల ప్రవేశాన్ని నియంత్రించాలని అధికారులకు సూచించారు.
ఈ సందర్భంగా విద్యార్థుల హాజరు శాతాన్ని తెలుసుకున్న కలెక్టర్‌కు అన్ని పరీక్షా కేంద్రాల్లో 100 శాతం హాజరు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
ఈ తనిఖీలలో సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు.









