ఘనంగా రంజాన్ వేడుకలు
భద్రాద్రి కొత్తగూడెం బ్యూరో,ఆధాబ్ న్యూస్: కరకగూడెం మండల వ్యాప్తంగా శనివారం ముస్లింలు భక్తి శ్రద్ధలతో పవిత్ర రంజాన్ పండుగను ఘనంగా నిర్వహించారు. పండుగ సందర్బంగా ప్రాంతమంతా పండుగ వాతావరణం నెలకొంది. మసీదులు వెలుగులతో అలంకరించబడి ఆధ్యాత్మిక కాంతితో మెరిసిపోయాయి.
ఈ సందర్భంగా కరకగూడెం జామా మసీదు, సఫియా మస్జిద్‌తో పాటు పద్మాపురం మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఉదయం నుంచే ముస్లిం సోదరులు సంప్రదాయ దుస్తులు ధరించి పెద్ద సంఖ్యలో మసీదులకు తరలివచ్చి నమాజ్‌లు అర్పించారు. అల్లాహ్ దయాకటాక్షాలు కలగాలని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం నెలకొనాలని ప్రార్థనలు చేశారు.
ప్రార్థనల అనంతరం ఒకరినొకరు ఆలింగనం చేసుకుంటూ “ఈద్ ముబారక్” అంటూ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. చిన్నారులు, యువతలో ప్రత్యేక ఉత్సాహం కనిపించగా, పెద్దలు స్నేహితులు, బంధువులను కలుసుకుని పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.
ఇళ్లలో ప్రత్యేక వంటకాలు సిద్ధం చేసి బంధుమిత్రులతో పంచుకున్నారు. పేదలకు సహాయం చేయడం, జకాత్ ఇవ్వడం వంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ రంజాన్ పండుగ సారాంశాన్ని ప్రతిబింబించారు. మొత్తం మీద మండలంలో రంజాన్ వేడుకలు ఆనందోత్సాహాలతో, సోదరభావంతో సాగాయి.









