తిరుపతిలో ముత్తవరపు రాజశేఖర్‌కు బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భూర్గంపాడు మండలం సారపాకకు చెందిన పరశురాం పరివార్ హిందూ సంస్థ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ముత్తవరపు రాజశేఖర్‌కు బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు లభించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తిరుపతిలో నిర్వహించిన సౌత్ ఇండియా బహుజన రైటర్స్ 18వ నేషనల్ కాన్ఫరెన్స్ సందర్భంగా ఈ అవార్డును ప్రదానం చేశారు. బహుజన సాహిత్య అకాడమీ (బీఎస్ఏ) జాతీయ అధ్యక్షుడు నల్ల రాధాకృష్ణ, జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ యు. సుబ్రహ్మణ్యం చేతుల మీదుగా రాజశేఖర్ ఈ అవార్డును అందుకున్నారు.
ఈ సందర్భంగా రాజశేఖర్ మాట్లాడుతూ గత ఫిబ్రవరి నెలలో తాము చేస్తున్న సేవలను గుర్తించి హ్యూమన్ రైట్స్ పబ్లిక్ ప్రొటెక్షన్ సర్వీసు సంస్థ సేవారత్న అవార్డును అందజేసిందని తెలిపారు. తాజాగా బహుజన సాహిత్య అకాడమీ నుంచి బెస్ట్ సర్వీస్ సొసైటీ నేషనల్ అవార్డు అందుకోవడం ఆనందంగా ఉందన్నారు.
గత ఎనిమిది సంవత్సరాలుగా సమాజ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తమ సేవలను గుర్తించి అవార్డు ప్రదానం చేసిన బహుజన సాహిత్య అకాడమీ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి సమాజానికి ఆదర్శంగా నిలుస్తామని రాజశేఖర్ పేర్కొన్నారు.









