ప్రతి క్షణం
ప్రజల పక్షం

  నీలాద్రిపేట గండిలో మెగా మెడికల్ క్యాంప్ – సోలార్ లైట్లు, వాలీబాల్ కిట్ల పంపిణీ ముఖ్య అతిథులు: జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజ్, ఐపీఎస్ – ఓఎస్డీ నరేందర్

నీలాద్రిపేట గండిలో మెగా మెడికల్ క్యాంప్ – సోలార్ లైట్లు, వాలీబాల్ కిట్ల పంపిణీ
ముఖ్య అతిథులు: జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజ్, ఐపీఎస్ – ఓఎస్డీ నరేందర్
భద్రాద్రి కొత్తగూడెం,ఆధాబ్ న్యూస్:
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కరకగూడెం మండలం నీలాద్రిపేట గండి గ్రామంలో జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజ్, ఐపీఎస్ ఆదేశాల మేరకు కరకగూడెం పోలీసుల ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్, సోలార్ లైట్లు, నిత్యావసర వస్తువులు మరియు యువతకు వాలీబాల్ కిట్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ బి. రోహిత్ రాజ్, ఐపీఎస్, ఓఎస్డీ నరేందర్ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించి గ్రామస్తులకు సోలార్ లైట్లు, నిత్యావసర సామగ్రిని పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎస్పీ రోహిత్ రాజ్ మాట్లాడుతూ యువత చెడు వ్యసనాలకు బానిస కాకుండా విద్యపై దృష్టి పెట్టాలని సూచించారు. తల్లిదండ్రులు పిల్లలను చిన్న వయసులోనే పనులకు తీసుకెళ్లకుండా తప్పనిసరిగా పాఠశాలకు పంపించాలని, వారి భవిష్యత్తు కోసం విద్య ఎంతో ముఖ్యమని తెలిపారు. గ్రామాల్లో బాల్య వివాహాలు జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే పరిసరాల పరిశుభ్రత, వ్యక్తిగత పరిశుభ్రత పాటించడం ద్వారా ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. గ్రామంలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు. గ్రామంలో ఎవరూ మద్యానికి బానిసై గొడవలకు దిగకుండా శాంతి భద్రతలను కాపాడాలని సూచించారు. గ్రామానికి రోడ్డు సదుపాయం కల్పించే విషయమై జిల్లా కలెక్టర్‌తో చర్చించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఓఎస్డీ నరేందర్ మాట్లాడుతూ పోలీస్ శాఖ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని తెలిపారు. గ్రామస్తులు పోలీసులతో సమన్వయం చేసుకుంటూ సమస్యలను తెలియజేస్తే వెంటనే పరిష్కరించే ప్రయత్నం చేస్తామని అన్నారు. యువత చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాలని సూచించారు.

ఈ సందర్భంగా డీఎస్పీ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతలను కాపాడటం అందరి బాధ్యత అని తెలిపారు. గ్రామస్తులు పోలీసులకు సహకరించి ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే తెలియజేయాలని సూచించారు. యువత చెడు అలవాట్లకు దూరంగా ఉండి సమాజానికి ఆదర్శంగా నిలవాలని అన్నారు.

సీఐ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గ్రామాల్లో నేరాలు, చెడు అలవాట్లు లేకుండా సమాజాన్ని మంచి దిశలో నడిపేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తోందని తెలిపారు. గ్రామస్తులు చట్టాలను పాటిస్తూ పోలీసులకు సహకరించాలని సూచించారు.

కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు మాట్లాడుతూ గ్రామాల్లో శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. గ్రామస్తులు ఎలాంటి అనుమానాస్పద వ్యక్తులు లేదా సంఘటనలు గమనించిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు.

యువతలో క్రీడాస్ఫూర్తి పెంపొందించేందుకు వాలీబాల్ కిట్లను పంపిణీ చేశారు. అనంతరం యువకులతో కలిసి ఎస్పీ రోహిత్ రాజ్ సరదాగా వాలీబాల్ ఆడుతూ వారిని ప్రోత్సహించారు. మెగా మెడికల్ క్యాంప్‌లో గ్రామస్తులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన మందులు అందజేశారు.

ఈ కార్యక్రమంలో డీఎస్పీ రవీందర్ రెడ్డి, సీఐ వెంకటేశ్వర్లు, కరకగూడెం ఎస్సై పి.వి.ఎన్. రావు, స్థానిక ప్రభుత్వ వైద్యుడు రవితేజ, మణుగూరు సూపరింటెండెంట్ సునీల్, ప్రైవేట్ వైద్యులు డాక్టర్ శశిధర్, డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ జయశ్రీ, డాక్టర్ ఉమాశంకర్, పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share

 మరిన్ని వార్తలు

error: Content is protected !!