నాగర్‌కర్నూల్‌లో వేలాది కోళ్లు మృతి – రైతుల్లో ఆందోళన
నాగర్ కర్నూల్,ఆధాబ్ న్యూస్:
నాగర్‌కర్నూల్ జిల్లాలో కోళ్లు భారీగా మృత్యువాత పడటం పౌల్ట్రీ రైతుల్లో ఆందోళన కలిగిస్తోంది. ఒకే రోజు దాదాపు 10 వేల కోళ్లు మృతి చెందడం స్థానిక రైతులను వణికిస్తోంది.
జిల్లాలోని పెద్దకొత్తపల్లి మరియు నాగర్‌కర్నూల్ మండలాల్లో పలు పౌల్ట్రీ ఫారాల్లో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు సమాచారం. అకస్మాత్తుగా కోళ్లు చనిపోవడంతో రైతులు భారీ నష్టాన్ని ఎదుర్కొంటున్నారు.
ఈ ఘటనకు కారణం ఏంటన్నది ఇంకా స్పష్టంగా తెలియకపోయినా, బర్డ్ ఫ్లూ (Bird Flu) కారణంగా ఉండొచ్చని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తీవ్రత దృష్ట్యా నమూనాలు సేకరించి పరిశీలించేందుకు ఫోరెన్సిక్ నిపుణుల బృందం రంగంలోకి దిగనున్నట్లు అధికారులు తెలిపారు.
కోళ్ల మృతికి అసలు కారణం ఏమిటన్నది నివేదిక వచ్చిన తర్వాతే స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు. జిల్లాలోని పౌల్ట్రీ రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు.









